రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన అన్ని అనుమతులు రెండు నెలల్లో ఇస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో కలిసి ఆయన కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, రామ్మోహన్ నాయుడును కలిశారు. ఈ సందర్భంగా రీజనల్ రింగ్ రోడ్డు, జాతీయ రహదారులు, ఎయిర్ పోర్టుల నిర్మాణం గురించి కేంద్రమంత్రులతో చర్చించారు.
ఈ సందర్బంగా మీడియాతో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. 95 శాతం సేకరణ పూర్తయింది. కేబినెట్ అప్రూవల్ వచ్చాక పరిహారం ఇస్తాం. హైదరాబాద్-విజయవాడ ఆరు లైన్ల రహదారి నిర్మాణానికి టెండర్లు పిలవాలని కోరాం. రెండు ప్యాకేజీలుగా రోడ్డు నిర్మాణం జరిపేందుకు గాను వాటి కోసం టెండర్లు పిలిచేందుకు అధికారులకు గడ్కరీ ఆదేశాలు ఇచ్చారు. శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్‌ను వేగవంతం చేయాలని కోరాం. ఫారెస్ట్ భూములు, అనుమతులు రావాల్సి ఉన్నందున ప్రత్యేక సమావేశం పెట్టాలని గడ్కరీ సూచించారు..అని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు.
కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో మామునూరు ఎయిర్ పోర్టు గురించి చర్చలు జరిపాం. మామునూర్ ఎయిర్ పోర్టుకు భూములు ఇచ్చేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. జీఎంఆర్ నుంచి ఎన్‌వోసీ తీసుకున్నాం. మరికొన్ని అనుమతులు రావాల్సి ఉంది. రెండున్నరేళ్లలో మామునూర్ ఎయిర్‌పోర్టు పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. మామునూర్ ఎయిర్ పోర్టుకు 15 రోజుల్లో భూ సేకరణ పూర్తవుతుంది..అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు.