హైదరాబాద్ ఉప్పల్‌లో కొన్నాళ్లుగా నిలిచిపోయిన ఎలివేటెడ్ కారిడార్ పనులపై తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుభవార్త చెప్పారు. బుధవారం స్థానిక ఎమ్మెల్యే, అధికారులతో కలిసి ఉప్పల్‌లో ఎలివేటెడ్ కారిడార్ పనులను పరిశీలించారు. 2017లో ప్రారంభమైన ఉప్పల్-నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులు..అర్ధంతరంగా నిలిపివేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గుంతలు పడిన రోడ్లపై ప్రయాణాలతో అవస్థలు పడుతున్నామని పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కొన్ని కారణాల వల్ల ఎలివేటెడ్ కారిడార్ పనులు పూర్తి కాలేదని, ఈ విషయంలో ఎవరినీ తప్పు పట్టాల్సిన అవసరం లేదన్నారు. మొదట నిర్మాణ పనులు చేపట్టిన గాయత్రీ సంస్థ తప్పుకోవడంతో పనులను మరో సంస్థకు అప్పగించామన్నారు. త్వరగా నిర్మాణ పనులు పూర్తి చేసి దసరా నాటికి అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి తెలిపారు.
ఉప్పల్ నుంచి నారపల్లి వరకు నిర్మిస్తోన్న ఈ ఎలివేటెడ్ కారిడార్ ప్రధాన ఉద్దేశం..ఉప్పల్ చౌరస్తాలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడం. అయితే ఘట్‌కేసర్, యాదాద్రి, వరంగల్ జిల్లాల వైపు వెళ్లే వాహనదారులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించాలనే లక్ష్యంతో దీనిని ప్రారంభించారు. ఈ ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు NHAI (కేంద్ర ప్రభుత్వం) ఆధ్వర్యంలో నిర్మితమవుతోంది. ఈ ఆరు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ అంచనా వ్యయం సుమారు రూ. 626.76 కోట్ల వరకు ఉంటుంది. ఈ ప్రాజెక్టులో భూసేకరణ వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. భూసేకరణకు సుమారు రూ. 330 కోట్ల నుంచి రూ. 768 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా.