నాకు కొడుకు లేడు..కార్యకర్తలే నా వారసులు: మంత్రి కోమటిరెడ్డి

నల్లగొండ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.

By Srikanth Gundamalla
Published on : 1 May 2024 5:30 PM IST

telangana, minister komatireddy,  congress,

నాకు కొడుకు లేడు..కార్యకర్తలే నా వారసులు: మంత్రి కోమటిరెడ్డి 

నల్లగొండ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. భావోద్వేగ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ కార్యకర్తల కోసం ప్రాణాలు ఇవ్వమన్నా ఇస్తానని అన్నారు. తనకు కొడుకు లేడనీ.. కాంగ్రెస్‌ కార్యకర్తలే తన వారసులని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.

నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో సొంత డబ్బులతో 35 ఏసీలు పెట్టించానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి వద్ద ఏ పని కావాలన్నా కూడా కార్యకర్తల కోసం తాను చేసిపెడతానని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో కూడా రఘువీర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలనీ పిలుపునిచ్చారు. కాబోయే ఎంపీ రఘువీర్‌తో కలిసి సర్పంచ్‌ ఎన్నికల్లో మరోసారి మీకోసం పనిచేస్తానని ఆయన హామీ ఇచ్చారు. పేదల పిల్లల చదువు బాధ్యతను ప్రతీక్‌ ఫౌండేషన్ తీసుకుంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. ప్రస్తుతం నీళ్ల కరవు రావడానికి కారణం గత ప్రభుత్వం బీఆర్‌స్సే అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును పట్టించుకోలేదనీ.. పక్కన పెట్టడంతో ఇక్కడ నీటి కరువు వచ్చిందన్నారు.

ఔటర్‌ రింగ్‌రోడ్డుకు దగ్గర రెండు వందల ఎకరాల్లో 10వేల ఇళ్లను కడుతామని చెప్పారనీ.. ప్రస్తుతం కేసీఆర్, కేటీఆర్ మానసిక పరిస్థితి దిగజారిందంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేస్తే మూసీ నదిలో వేసినట్లు అని చెప్పారు. అయితే.. దేశంలో త్వరలోనే సంకీర్ణ ప్రభుత్వం రాబోతుందని కోమటిరెడ్డి జోస్యం చెప్పారు. ప్రధానిగా రాహుల్‌ గాంధీ బాధ్యతలు తీసుకుంటారని అన్నారు.

Next Story