ఐటీ అధికారులను అడ్డుకున్నందుకు.. మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు
Telangana min Malla Reddy booked for obstructing IT officials. తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఆయన బంధువులు, స్నేహితులు, విద్యాసంస్థల్లో ఆదాయపన్ను
By అంజి Published on 24 Nov 2022 8:16 PM ISTతెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఆయన బంధువులు, స్నేహితులు, విద్యాసంస్థల్లో ఆదాయపన్ను శాఖ (ఐటీ) సోదాలు జరుగుతున్న సమయంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అధికారులు తన కొడుకును కొట్టారని మంత్రి మల్లారెడ్డి బుధవారం ఆరోపించగా.. గురువారం తమపైనే మల్లారెడ్డి దాడి చేశారని ఐటీ అధికారులు ప్రతి ఆరోపణలు చేశారు. మల్లారెడ్డి, అతని బంధువులు లేదా అనుచరులు తమ విధులను అడ్డుకున్నారని, సోదాల్లో స్వాధీనం చేసుకున్న ల్యాప్‌టాప్, ఫోన్, ఇతర పత్రాలను లాక్కున్నారని రత్నాకర్ అనే ఆదాయపు పన్ను శాఖ అధికారి బోవెన్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. భారత శిక్షాస్మృతిలోని 353, 506 సెక్షన్ల కింద మంత్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
'సివిల్ సర్వెంట్ విధులకు ఆటంకం కలిగించడం, తప్పుడు సమాచారం ఇవ్వడం, అసభ్యపదజాలంతో దూషించడం, ల్యాప్‌టాప్, ఫోన్‌లను లాక్కోవడం, సాక్ష్యాలు, ఆధారాలను ధ్వంసం చేయడం' వంటి ఆరోపణలను మల్లారెడ్డిపై అధికారులు మోపారు. ఇదిలా ఉంటే.. మల్లారెడ్డి చిన్న కుమారుడు భద్రారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆదాయపు పన్ను శాఖ అధికారిపై మరో కేసు నమోదైంది. ఒకరోజు ముందు తన ఇంట్లో ఐటీ సోదాలు జరిగినప్పుడు అనారోగ్యంతో అడ్మిట్ అయిన సూరారం ఆస్పత్రిలో తన అన్న మహేందర్ రెడ్డిని ఐటీ శాఖ అధికారులు బలవంతంగా సంతకం చేయించుకున్నారని ఆరోపించారు. ఐటీ అధికారిపై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 384 కింద కేసు నమోదు చేశారు.
ఈ ఘటనపై బోయిన్‌పల్లి పోలీసులు రెండు కేసులు నమోదు చేసి దుండిగల్ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. తనపై, తన కుటుంబ సభ్యులపై ఆదాయపన్ను శాఖ (ఐటీ) దాడులు చేయడం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తనను లక్ష్యంగా చేసుకుని చేస్తున్న పెద్ద కుట్రలో భాగమేనని మల్లా రెడ్డి అనంతరం విలేకరుల సమావేశంలో ఆరోపించారు. ''టిఆర్ఎస్ తన కార్యకలాపాలను ఇతర రాష్ట్రాలకు విస్తరింపజేసి చివరికి బిజెపికి ముప్పు తెస్తుందని బిజెపి భయపడుతోంది. కానీ ఈ దాడులకు నేను భయపడను. మేం ఎలాంటి తప్పు చేయనందున సంబంధిత అధికారులకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నాం''అని మల్లారెడ్డి తెలిపారు.