దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఈ మహమ్మారిని అంతం చేసేందుకు ఏ చిన్న మార్గం కనిపించినా.. ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య అనే వ్యక్తి కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు తయారు చేసిన ఆయుర్వేద మందును ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో పాటు యావత్తు దేశం ఆసక్తిగా గమనిస్తోంది. ప్రస్తుతం దీని శాస్త్రీయ నిర్థారణ కోసం అధికారులు ప్రయోగాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి కూడా సరికొత్త ప్రయోగం చేశాడు.
మంథని ప్రాంతానికి చెందిన గోశాల నిర్వాహకుడు రమేష్ సరికొత్త ప్రయోగం చేశారు. అడవిలో తిరిగే ఆవుల నుంచి సేకరించిన పేడ పిడకలను నెయ్యి, పసుపు, ఆవాలు, కర్పూరం వేసి కాల్చడం ద్వారా వచ్చే పొగతో వైరస్ అంతం కావడంతో పాటు గాలిలో మంచి ప్రాణవాయువు పెరుగుతుందని తెలిపారు. ప్రతి రోజు రెండు గంటల పాటు ఇలా పొగ పెడితే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు. ప్రతి ఇంట్లో ఇలా చేస్తే బాగుంటుందన్నారు. ఈ ప్రయోగాన్ని మంథనీ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు కార్యాలయంలో నిర్వహించారు. వింత ప్రయోగం బాగుందని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు గోశాల నిర్వాహకులను అభినందించారు.