లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ ఓటమికి కారణాలివే..

తెలంగాణలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ ఘోర ఓటమిని చూసింది.

By Srikanth Gundamalla  Published on  5 Jun 2024 10:15 AM IST
telangana, lok sabha election results, brs, zero seats,

లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ ఓటమికి కారణాలివే..

తెలంగాణలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ ఘోర ఓటమిని చూసింది. ఒక్క చోట కూడా విజయాన్ని అందుకోలేక పోయింది. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి వరుసగా షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. అంతేకాదు.. కంటోన్మెంట్‌ అసెంబ్లీ ఉపఎన్నిక కూడా కాంగ్రెస్‌ ఎగురేసుకుపోయింది. మొత్తం 17 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగ్గా.. అధికార పార్టీ కాంగ్రెస్ 8 స్థానాల్లో గెలిచింది. బీజేపీ మరో 8 చోట్ల విజయాన్ని అందుకుంది. మరో స్థానం హైదరాబాద్‌లో ఎంఐఎం గెలుపును నమోదు చేసుకుంది.

పదేళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉండి.. లోక్‌సభ ఎన్నికల్లో ఒక్కటి అంటే ఒక్క సీటు కూడా దక్కించుకోకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అంతేకాదు.. 14 స్థానాల్లో బీఆర్ఎస్‌ అభ్యర్థులు మూడో స్థానానికే పరిమితం అయ్యారు. ఖమ్మం, మహబూబాబాద్‌లో మాత్రమే రెండో స్థానంలో నిలిచింది. ఇక హైదరాబాద్‌ లోక్‌సభ స్థానంలో అయితే ఏకంగా నాలుగో స్థానానానికి పరిమితమైంది బీఆర్ఎస్.

2001లో టీఆర్‌ఎస్‌ (బీఆర్ఎస్) పార్టీ ఆవిర్భావం జరిగింది. ఆ తర్వాత 2004లో తొలిసారి పార్లమెంట్‌ ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో గులాబీ పార్టీ ఐదు స్థానాల్లో విజయాన్ని అందుకుంది. ఇక ఆ తర్వాత 2008లో ఉపఎన్నికల్లో రెండు సీట్లు, 2009 సార్వత్రిక ఎన్నికల్లో రెండు స్థానాల్లో విజయాన్ని అందిపుచ్చుకుంది. ఇక తెలంగాణ ఆవిర్భావం తర్వాతా 2014లో జరిగిన ఎన్నికల్లో ఏకంగా 11 లోక్‌సభ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. 2019లో కాస్త సీట్లు తగ్గి 9 స్థానాల్లో గెలిచింది. ఇక తాజాగా 2024 ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేదు బీఆర్ఎస్. 2004 నుంచి ప్రతి పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి లోక్‌సభలో ప్రాతినిథ్యం ఉండగా.. 20 ఏళ్ల తర్వాత తొలిసారి సున్నాకు పరిమితం అయ్యింది. బీఆర్ఎస్‌కు ఇంతటి పరాభవానికి గల కారణాలను విశ్లేషకులు తమ అభిప్రాయాలు చెబుతున్నారు.

లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ ఘోర ఓటమికి కారణం క్రాస్‌ ఓటింగ్‌ అని తెలుస్తోంది. యువత, కొత్త ఓటర్లు ఎక్కువగా కాంగ్రెస్, బీజేపీ వైపు మొగ్గు చూపారని అంటున్నారు విశ్లేషకులు. రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీల్లో భాగంగా మహిళలకు ఫ్రీ బస్ జర్నీ, పెన్షన్, గ్యాస్ సిలిండర్ పై రాయితీ వంటి పథకాలను అమలు చేయగా.. మహిళా ఓటర్లు ఎక్కువ ఆకర్షితులైనట్టు కూడా తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికలకు వచ్చేసరికి ప్రధాని మోదీ చరిష్మాతో బీజేపీ వైపు మళ్లినట్టు తెలిసింది. కాంగ్రెస్, బీజేపీ క్యాండిడేట్లతో పోలిస్తే బీఆర్ఎస్‌ ​నుంచి పోటీ చేసిన వారు బలహీనమైన అభ్యర్థులుగా గుర్తించారనీ.. అందుకే ఓటర్లు బీఆర్ఎస్‌కు మొగ్గు చూపి ఉండకపోవచ్చని విశ్లేషకుల అభిప్రాయ పడుతున్నారు.

Next Story