Telangana: శాసనమండలిలో రచ్చ.. బీఆర్‌ఎస్‌ సభ్యుల సస్పెన్షన్‌

శాసనమండలి నుంచి బీఆర్‌ఎస్‌ సభ్యులను చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి ఒక రోజు సస్పెండ్‌ చేశారు. వారిని గౌరవప్రదంగా బయటికి పంపాలని చీఫ్‌ మార్షల్‌ను ఆదేశించారు.

By -  అంజి
Published on : 30 March 2026 12:15 PM IST

Telangana Council Suspension, BRS MLCs, Raghava Constructions, Illegal Mining Case, Minister Ponguleti Srinivas Reddy, Gutta Sukhender Reddy, D Sridhar Babu, House Committee Demand

Telangana: శాసనమండలిలో రచ్చ.. బీఆర్‌ఎస్‌ సభ్యుల సస్పెన్షన్‌

హైదరాబాద్: శాసనమండలి నుంచి బీఆర్‌ఎస్‌ సభ్యులను చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి ఒక రోజు సస్పెండ్‌ చేశారు. వారిని గౌరవప్రదంగా బయటికి పంపాలని చీఫ్‌ మార్షల్‌ను ఆదేశించారు.

రాఘవ కన్స్ట్రక్షన్స్‌కు సంబంధించిన అక్రమ మైనింగ్ వ్యవహారంపై హౌస్ కమిటీ వేయాలని, అలాగే మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ సభ్యులు చేపట్టిన ఆందోళనతో శాసనమండలి దద్దరిల్లింది. సభ ప్రారంభం కాగానే బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ చైర్మన్ పోడియంను చుట్టుముట్టారు. ఈ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని పట్టుబట్టారు.

విపక్ష సభ్యుల ఆందోళనపై శాసనసభ వ్యవహారాల మంత్రి డి. శ్రీధర్ బాబు స్పందిస్తూ.. ఈ వ్యవహారంపై ఇప్పటికే ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో స్పష్టత ఇచ్చారని గుర్తుచేశారు. దీనిపై సీఐడీ (CID) విచారణకు ఆదేశిస్తామని ప్రభుత్వం తెలిపిందని, కాబట్టి సభా కార్యకలాపాలకు సహకరించాలని కోరారు. పెద్దల సభగా పిలవబడే కౌన్సిల్ గౌరవాన్ని కాపాడాలని ఆయన సభ్యులకు విజ్ఞప్తి చేశారు.

మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా పలుమార్లు ఆందోళనకారులను తమ సీట్లలో కూర్చోవాలని, సభ సాఫీగా సాగేలా చూడాలని కోరినప్పటికీ ఫలితం లేకపోయింది. బీఆర్ఎస్ సభ్యులు వెనక్కి తగ్గకుండా నిరసనను కొనసాగించడంతో, మంత్రి శ్రీధర్ బాబు వారిని ఈరోజుకు సస్పెండ్ చేయాలని కోరుతూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

మంత్రి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆమోదిస్తూ, ఆందోళన చేస్తున్న సభ్యులందరినీ ఈ రోజు సెషన్ ముగిసే వరకు సస్పెండ్ చేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు. సస్పెండ్ అయిన వారిలో జి. మధుసూదనాచారి, టి. రవీందర్ రావు, దేశపతి శ్రీనివాస్, ఎల్. రమణ, యాదవ రెడ్డి, నవీన్ కుమార్ రెడ్డి, మధుసూదన్, సుంకిరి రాజు, వాణీ దేవి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మరియు ఎం. కోటి రెడ్డి తదితరులు ఉన్నారు.

Next Story