రేపే భారత్ జోడో యాత్ర పునఃప్రారంభం.. ఇవాళ హైదరాబాద్‌కు రాహుల్
Telangana leg of Bharat Jodo Yatra to resume from Oct 27. హైదరాబాద్: మూడు రోజుల విరామం తర్వాత రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర అక్టోబర్ 27న తెలంగాణలోని
By అంజి Published on 26 Oct 2022 12:04 PM ISTహైదరాబాద్: మూడు రోజుల విరామం తర్వాత రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర అక్టోబర్ 27న తెలంగాణలోని నారాయణపేట జిల్లా మక్తల్ నుండి తిరిగి ప్రారంభమవుతుందని పార్టీ వర్గాలు బుధవారం తెలిపాయి. భారత్ జోడో యాత్ర అక్టోబరు 23 ఉదయం రాయచూర్ నుంచి కర్ణాటక బయల్దేరి గూడెబెల్లూర్ మీదుగా రాష్ట్రంలోకి ప్రవేశించింది. ఆ తర్వాత ఆదివారం మధ్యాహ్నం నుంచి అక్టోబర్ 26 వరకు మూడు రోజుల పాటు రాహుల్ గాంధీ విరామం కోసం ఢిల్లీ వెళ్లారు.
రేపు మక్తల్‌లోని 11/22 కెవి సబ్‌స్టేషన్ నుండి ఉదయం 6.30 గంటలకు యాత్ర తిరిగి ప్రారంభమవుతుంది. మూడు కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత రాహుల్ కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని సందర్శించి ప్రార్థనలు చేయవచ్చని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. పెద్దచెరువు, దండు క్రాస్, గొల్లపల్లి క్రాస్ మీదుగా బండ్లగుంట వరకు పాదయాత్ర సాగనుంది. ఈ సాయంత్రం రాహుల్ గాంధీ రాష్ట్రానికి చేరుకునే అవకాశం ఉందని టీపీసీసీ వర్గాలు తెలిపాయి. గాంధీ వారసుడు రాహుల్ తలపెట్టిన పాదయాత్ర గురువారం 26.7 కిలోమీటర్లు పూర్తి చేసి రాత్రికి మక్తల్‌లోని శ్రీ బాలాజీ ఫ్యాక్టరీ వద్ద ఆగుతుంది.
నారాయణ పేట్ జిల్లా మక్తల్ నుంచి తెలంగాణలో 16 రోజుల పాటు 19 అసెంబ్లీ, 7 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 375 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగి నవంబర్ 7న మహారాష్ట్రలో ప్రవేశిస్తుంది. నవంబర్ 4న మార్చ్‌కు ఒకరోజు సాధారణ విరామం లభిస్తుంది. వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ.. మేధావులు, వివిధ సంఘాల నాయకులు, రాజకీయ నాయకులు, క్రీడా, వ్యాపార, సినీ రంగ ప్రముఖులను కూడా కలవనున్నారు. తెలంగాణలోని కొన్ని ప్రార్థనా మందిరాలు, మసీదులు, హిందూ దేవాలయాలను రాహుల్ సందర్శించనున్నారు. సర్వమత ప్రార్థనలు కూడా చేయనున్నట్లు టీపీసీసీ తెలిపింది.
భారత్ జోడో యాత్ర సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభమైంది. తెలంగాణ యాత్ర ప్రారంభించే ముందు రాహుల్ గాంధీ తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలలో భారత్ జోడ యాత్రను పూర్తి చేశారు. తెలంగాణలో యాత్రను సమన్వయం చేసేందుకు రాష్ట్ర కాంగ్రెస్ 10 ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. తెలంగాణలో 375 కిలోమీటర్లు మేర రాహుల్ పాదయాత్ర చేయనున్నారు. యాత్ర చివరి రోజున భారీ సమావేశానికి టీ కాంగ్రెస్ నేతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ సభకు భారీగా జనసమీకరణ చేపట్టాలని వ్యూహరచన చేస్తున్నారు.