ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై తెలంగాణ మహిళా కమిషన్‌కు తెలంగాణ జాగృతి మహిళా విభాగం నాయకులు సోమవారం ఫిర్యాదు చేశారు. మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద అందుబాటులో లేకపోవడంతో మహిళా కమిషన్ సభ్యులు సుదం లక్ష్మీ, రేవతి రావు, ఉమ, అప్రోజ్ సహీనాకు తెలంగాణ జాగృతి మహిళా విభాగం నాయకులు లేఖ అందజేశారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశారని మహిళా కమిషన్‌కు జాగృతి నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు. మల్లన్న తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పకపోగా ఈ రోజు అంతకన్నా తీవ్ర స్థాయిలో ఎమ్మెల్సీ కవితను దూషించారని మహిళా కమిషన్ సభ్యులకు జాగృతి నాయకులు వివరించారు. అలాగే పలు ప్రాంతాల్లో తీన్మార్ మల్లన్నపై పోలీస్ స్టేషన్‌లలో జాగృతి నాయకులు ఫిర్యాదు చేస్తున్నారు. ఇవాళ ఉదయం ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మల్లన్నపై చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ ఇచ్చారు.