సామాజిక కోణంలో తెలంగాణ జాగృతి రెండో విడత రాష్ట్ర కమిటీని జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్త పర్యటనలు.. ఆ తర్వాత మూడో విడత కమిటీ ప్రకటన చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఎస్టీ నేతకు ఇచ్చారు. విజయదశమి సందర్భంగా గురువారం రాత్రి కవిత రెండో విడత రాష్ట్ర కమిటీని ప్రకటించారు. తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎస్టీ నేత ఎల్. రూప్ సింగ్ నాయక్ ను నియమించారు.
తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యవర్గంలో 80 శాతానికిపైగా పదవులను బడుగు బలహీన వర్గాలకు కట్టబెట్టారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా కల్వకుంట్ల కవిత పర్యటించనున్నారు.. జిల్లా పర్యటనల్లో మేధావులు, కవులు, కళాకారులు, వివిధ రంగాల నిపుణులతో సమావేశం కానున్నారు. ప్రజలతో పాటు ఆయా రంగాల ప్రముఖుల సలహాలు, సూచనల మేరకు త్వరలో తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యవర్గం మూడో విడత ప్రకటన ఉంటుందని కల్వకుంట్ల కవిత తెలిపారు. జాగృతిలో కొత్త బాధ్యతలు అప్పగించిన వారు సంస్థ ఆశయాలకు అంకితమై పని చేయాలని కల్వకుంట్ల కవిత గ సూచించారు. ఈ నియామకాలు వెంటనే అమలులోకి వస్తాయని పేర్కొన్నారు.