బీఆర్‌ఎస్ నుంచి తన సస్పెన్షన్ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తనకు తెలియదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. హరీశ్ రావు సోషల్ మీడియా, సంతోష్ రావు సీక్రెట్ మీడియా, బీఆర్‌ఎస్ మీడియా అన్నీ తనపైనే దాడి చేస్తాయని చెప్పారు. ఈ విషయం తెలంగాణ ప్రజలకు తెలుసునని వ్యాఖ్యానించారు. ఇందులో ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అంశం ఏమి లేదని పేర్కొన్నారు. తాను స్పీకర్ ఫార్మాట్‌లోనే రాజీనామా లేఖను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి పంపించానని చెప్పారు. చైర్మన్ ఎందుకు ఆలస్యం చేస్తున్నారో తనకు తెలియదన్నారు.
కచ్చితంగా తన రాజీనామాను ఆమోదించాల్సిందేనని చెప్పారు. మరోసారి రాజీనామా లేఖను పంపమన్నా కూడా పంపిస్తానన్నారు. బీఆర్‌ఎస్ నుంచి వచ్చిన ఆ పదవి తనకు వద్దన్నారు. అటు ఉమ్మడి రాష్ట్రంలో కూడా కృష్ణా జలాల కోసం పోరాడామని కవిత అన్నారు. కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు 5 మీటర్లు పెంచితే కృష్ణా నది కనుమరుగు అవుతుందని, ఐదు జిల్లాలకు నీరు అందక రైతులు ఇబ్బందులు పడతారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా వాటర్ బోర్డు మీటింగ్‌కు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కావాలని కవిత డిమాండ్ చేశారు.