కరెంటు కోతలు లేని ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ: మంత్రి కేటీఆర్

రాష్ట్రం ఏర్పడిననాడు ఆవరించి ఉన్న చిమ్మ చీకట్లను చీల్చుకుంటూ, విద్యుత్తు రంగంలో అద్భుత రీతిలో పురోగతి సాధించి,

By అంజి  Published on  5 Jun 2023 1:00 PM IST
Telangana, power cuts, Minister KTR

కరెంటు కోతలు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ: మంత్రి కేటీఆర్ 

రాష్ట్రం ఏర్పడిననాడు ఆవరించి ఉన్న చిమ్మ చీకట్లను చీల్చుకుంటూ, విద్యుత్తు రంగంలో అద్భుత రీతిలో పురోగతి సాధించి, దేశానికే దారిచూపే టార్చ్‌ బేరర్‌గా తెలంగాణ నిలిచిందని మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. కరెంట్ కోతలు, పవర్ హాలీడేలు, కరెంట్‌ కోసం ధర్నాలు, సబ్‌స్టేషన్ల ముట్టడి, రాస్తారోకోలు 2014 కు పూర్వం నిత్యకృత్యాలని, స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అకుంఠిత దీక్షతో కరెంట్‌ నిరంతరాయంగా వెలుగులు పంచుతున్నదని అన్నారు. నేడు యావత్‌ భారతదేశంలో కరెంటు కోతలు లేని ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. మండు వేసవిలో సైతం అన్ని రంగాలకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్తును అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, స్వతంత్ర భారత దేశంలో విద్యుత్తు రంగంలో ఏ రాష్ట్రము సాధించని విజయాలు కేసీఆర్ నాయకత్వం లోని తెలంగాణ ప్రభుత్వం సాధించిందన్నారు.

తెలంగాణ విద్యుత్తు రంగాన్ని తీర్చిదిద్దడం కోసం సీఎం కేసీఆర్ పక్కా ప్రణాళికతో షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ పేరిట ప్రత్యేక లక్ష్యాలు నిర్దేశించి, అనుసరించిన త్రిముఖ వ్యూహం అత్యద్భుత ఫలితాలు ఇచ్చిందని, విద్యుత్ ఉత్పత్తికి, వినియోగానికి సంబంధించిన గణాంకాలే తెలంగాణ విద్యుత్ విజయాలను చాటి చెప్తాయన్నారు. రాష్ట్రం ఏర్పడేనాటికి ఉన్న స్థాపిత విద్యుత్‌ సామర్థ్యం కేవలం 7,778 మెగావాట్లు మాత్రమేనని, కేసీఆర్ ప్రభుత్వం చేసిన కృషి ఫలితంగా నేడు రాష్ట్రం కలిగి ఉన్న స్థాపిత విద్యుత్‌ సామర్థ్యం 18,567 మెగావాట్లు అని అన్నారు.

''తలసరి విద్యుత్తు వినియోగం సైతం ఒక ప్రధాన ప్రగతి సూచిక. 2014-15లో తెలంగాణలో తలసరి విద్యుత్తు వినియోగం 1,356 యూనిట్లు మాత్రమే ఉండేది.2021-22 నాటికి అది 2,126 యూనిట్లకు పెరిగింది. ఇదే సమయంలో జాతీయ సగటును గనుక పరిశీలిస్తే1,255 యూనిట్లుగా ఉన్నది. అంటే తెలంగాణ తలసరి విద్యుత్తు వినియోగం, జాతీయ తలసరి వినియోగంకన్నా 69.40 శాతం ఎక్కువగా నమోదవడం మనందరికీ గర్వకారణం'' అని ట్వీట్‌ చేశారు.

వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా

తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రైతులు దశాబ్దాల తరబడి కరెంటు కష్టాలు అనుభవించారు. రోజుకు కనీసం 3 లేదా 4 గంటల కరెంటు కూడా రాకపోయేది. దీంతో పంటలు ఎండిపోయి రైతులు విపరీతంగా నష్టపోయేవారు. వచ్చే కరెంటు కూడా లో ఓల్టేజిది కావడంతో మోటార్లు కాలిపోయేవి. ట్రాన్స్ ఫార్మర్లు పేలిపోయేవి. వాటి మరమ్మతుల కోసం రైతులు తిరిగి ఖర్చులు పెట్టుకోవాల్సి వచ్చేది. ఈ కష్టాలన్నింటికీ తెరదించుతూ తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని 27 లక్షల రైతుల వ్యవసాయ మోటార్లకు 24 గంటలూ నాణ్యమైన విద్యుత్ ను ఉచితంగా అందిస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో 19 లక్షల వ్యవసాయ కరంటు మోటార్ కనెక్షన్లు ఉంటే.. 2022 వరకు తెలంగాణ ప్రభుత్వం కొత్తగా 8 లక్షల మోటార్లకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చింది. ఇప్పుడు తెలంగాణ రైతులకు కరెంటు లేక నీళ్ళు ఆగిపోతాయనే దిగులు లేదు, మోటర్ కాలిపోతదన్న భయం లేదు. ఎలాంటి షరతులు లేకుండా దేశంలోనే 24 గంటలపాటు వ్యవసాయానికి ఉచితంగా నాణ్యమైన కరెంటు ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే.

సీఎం కేసీఆర్ పవర్ ఫుల్ విజన్

ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుకు నిదర్శనం హైదరాబాద్ నగరానికి పవర్ ఐలాండ్! ఆర్థిక, పారిశ్రామిక, ఐటీలాంటి అన్ని రంగాలకూ గుండెకాయలాంటి హైదరాబాద్‌ను సీఎం కేసీఆర్‌ ‘పవర్‌ ఐలాండ్‌’గా మార్చారు. దేశంలో ఇంకే నగరం కనీసం అలోచించని వినూత్న "పవర్ ఐలాండ్" హైదరాబాద్ నగరానికి ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దీని వల్ల జాతీయ విద్యుత్ గ్రిడ్ విఫలమైనా నగరంలో కరెంటు సరఫరాకు విఘాతం కలగదు. నగరం చుట్టూ 25 కిలోమీటర్లు, 80-100 కిలోమీటర్లు, 180-200 కిలోమీటర్ల పరిధిలో మూడు వలయాల్లో విద్యుత్ ఐలాండ్ నెలకొల్పారు. నేడు దేశంలోనే తొలి పవర్‌ ఐలాండ్‌ మెట్రో నగరంగా హైదరాబాద్‌ ప్రశంసలు అందుకొంటున్నది.

Next Story