తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలను రద్దు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. ఇప్పటికే ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం.. ఫస్ట్ ఇయర్‌లో వచ్చిన గ్రేడ్‌ల ప్రకారమే సెకండియర్‌లో గ్రేడింగ్ ఇవ్వనున్నట్టు తెలిపింది. పరీక్షలు నిర్వహిస్తే మళ్లీ కరోనా కేసులు విజృంభించే అవకాశం ఉండటంతో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ ఫస్టియర్ విద్యార్ధులను ప్రమోట్ చేసిన సమయంలో కరోనా కేసులను దృష్టిలో ఉంచుకొని జూన్ మాసంలో సమీక్ష చేసి నిర్ణయం తీసుకొంటామని ప్రకటించింది. ఈ నెల 8వ తేదీన నిర్వహించిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో ఈ విషయమై నిర్ణయం తీసుకొన్నారు.
ఈ ఏడాది జూలై మాసంలో ఇంటర్ సెకండియర్ పరీక్షలను నిర్వహించాలని బోర్డు తొలుత ప్రతిపాదించింది. సగం పరీక్ష పేపర్ ద్వారా విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని ప్రతిపాదించారు. పరీక్ష సమయాన్ని 3 గంటల నుండి సగానికి కుదించాలని బావించారు. రాష్ట్రంలో ఇప్పటికే కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. అయితే.. సెకండ్ ఇయర్ పరీక్షలునిర్వహిస్తే కరోనా కేసులు మళ్లీ పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం బావించింది. దీంతో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లుగా తెలంగాణ ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. రాష్ట్రంలో 4.47లక్షల మంది విద్యార్థులు ఇంటర్ సెకండియర్ పరీక్షలకు ఫీజు కట్టారు. వీరంతా కూడా ఉత్తీర్ణులైనట్లేనని ప్రభుత్వం తెలిపింది.