హైదరాబాద్: యూనివర్సిటీ అధ్యాపకుల రిటైర్మెంట్ వయసును పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 60 నుంచి 65 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఉన్నత విద్యాశాఖ పరిధిలోని యూజీసీ వేతన స్కేల్ పొందుతున్న అధ్యాపకులకే ఈ ఉత్తర్వులు వర్తించనున్నాయి. సీనియర్ ఫ్యాకల్టీ సేవలను వినియోగించుకునేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా గురువారం రాత్రి జోవో నంబర్ 3 జారీ చేశారు. సీఎం రేవంత్.. కొద్ది రోజుల కిందట అధ్యాపకుల పదవీ విరమణ వయసును 65 ఏళ్లకు పెంచాలన్న యోచనను ప్రకటించిన సంగతి తెలిసిందే.
దీనిపై గత నెలలో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. దీంతో ప్రభుత్వం పదవీ విరమణ వయసు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో పదవీ విరమణ వయసు 60గా ఉండటం వల్ల ప్రతి ఏటా అధ్యాపకుల ఖాళీలు భారీగా పెరుగుతుండటం, న్యాక్ గ్రేడ్, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్‌లో వర్సిటీలు వెనుకబడే పరిస్థితి ఉండటంతో గత 10 ఏళ్ల డిమాండ్‌పై సీఎం రేవంత్ ఈ ప్రకటన చేశారు. దీంతో వర్సిటీ అధ్యాపకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొత్త నోటిఫికేషన్ ఇవ్వరా? అంటూ దీనిపై నిరుద్యోగ జేఏసీ మండిపడుతోంది.