ఢిల్లీ కోచింగ్ సెంటర్‌లో వరద.. చనిపోయిన తెలంగాణ అమ్మాయి
రావ్స్ సివిల్స్ కోచింగ్ సెంటర్ బేస్‌మెంట్‌లో వరద నీళ్లలో పడి చనిపోయిన వారిలో తెలంగాణకు చెందిన యువతి కూడా ఉంది.
By అంజి Published on 28 July 2024 9:33 AM GMTఢిల్లీ కోచింగ్ సెంటర్‌లో వరద.. చనిపోయిన తెలంగాణ అమ్మాయి
దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాల ధాటికి ఓల్డ్ రాజేంద్రనగర్‌లోని రావ్స్ కోచింగ్ సెంటర్ బేస్‌మెంట్ వరద నీటితో నిండిపోయింది. అందులో చిక్కుకున్న ముగ్గురు సివిల్స్ అభ్యర్థులు మృతి చెందారు. వారి మృతి దేహాలను ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది వెలికి తీశారు. రావ్స్ సివిల్స్ కోచింగ్ సెంటర్ బేస్‌మెంట్‌లో వరద నీళ్లలో పడి చనిపోయిన వారిలో తెలంగాణకు చెందిన యువతి కూడా ఉంది. మృతులు తన్య సోని (తెలంగాణ), శ్రేయా యాదవ్ (యూపీ), నవీన్ దల్విన్ (కేరళ)గా అధికారులు గుర్తించారు.
ఇరవై ఐదేళ్ల తన్య సోని ఐఏఎస్ ఆఫీసర్ కావాలని ఎన్నో కలలు కన్నారు. అందుకోసం ఏడాది క్రితం ఎలైట్ కోచింగ్ సెంటర్‌లో చేరారు. ఆమె తండ్రి విజయ్ కుమార్ శ్రీరాంపూర్‌లోని SRP-I భూగర్భ గనిలో మేనేజర్. విషాదం సమయంలో ఆమె తల్లిదండ్రులు నాగ్‌పూర్‌లో ఉన్నారు. సమాచారం తెలుసుకున్న వారు తమ కుమార్తె మృతదేహాన్ని మంచిర్యాలకు తీసుకురావడానికి రాజధాని ఢిల్లీకి వెళ్లారు.
సెల్లార్ ప్రాంతంలో ఒక్కసారిగా 10 నుంచి 12 అడుగుల ఎత్తులో వరద నీరు రావడంతో వీరు అందులో చిక్కుకుని చనిపోయారు. నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి బేస్‌మెంట్లలో ఇల్లీగల్‌గా నడుస్తున్న లైబ్రరీలను మూసివేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై నిరసనలు చేపట్టారు.