గన్‌మెన్‌ను చెంపదెబ్బ కొట్టిన తెలంగాణ హోంమంత్రి (వీడియో)
తెలంగాణ హెంమంత్రి మహమూద్ అలీ గన్‌మెన్‌ను చెంపదెబ్బ కొట్టారు. వీడియో వైరల్ అవుతోంది.
By Srikanth Gundamalla Published on 6 Oct 2023 1:07 PM ISTగన్‌మెన్‌ను చెంపదెబ్బ కొట్టిన తెలంగాణ హోంమంత్రి (వీడియో)
ప్రజాప్రతినిధులు జనాల్లోకి వెళ్లినప్పుడు కాస్త ఇబ్బందిగా ఫీలయినప్పుడో లేదంటే.. జనాలు ఎక్కువగా ఉండటం వల్ల అనుకోకుండా ఇతరులపై చేయి చేసుకంటారు. మంత్రులు ఇలాంటి వివాదాలో చిక్కుకోవడం తాజాగా చూస్తున్నాం. ఇలాంటి సంఘటనకు సంబంధించిన వార్తలు పేపర్లో చదవడమే కాదు.. టీవీల్లో వీడియోలను కూడా చూశాం. అయితే.. తాజాగా తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ కూడా సరిగ్గా ఇలాంటి వివాదంలోనే చిక్కుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే.. అక్టోబర్ 6వ తేదీన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా తలసాని బల్కంపేట ఎల్లమ్మ దేవాలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఆయన్ని ఆశీర్వదించి దీవెనలు అందించారు. ఆ తర్వాత మంత్రి తలసాని ఓ సభా కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే.. ఆ సమావేశానికి తెలంగాణ హోంమంత్రి మహమూద్‌అలీ కూడా హాజరు అయ్యారు. తలసానిని చూసిన మహమూద్ అలీ ఆయన పుట్టిన రోజు కావడంతో శుభాకాంక్షలు చెప్పాలనుకున్నారు. ఆ క్రమంలో తలసానిని ఆలింగనం చేసుకుని విషెస్ చెప్పారు. అయితే.. అప్పటికే మహమూద్‌అలీ తన వెంట పూల బొకేను తీసుకొచ్చినట్లు ఉన్నారు. సమయానికి తలసానికి అందించాలనే ఆలోచనతో గన్‌మెన్‌తో బొకె ఎక్కడుందని గట్టిగా అడిగారు.
సభ కావడం ఇతర ప్రజాప్రతినిధులతో పాటు జనాలు ఎక్కువగా ఉండటంతో సరిగ్గా వినిపించినట్లు లేదు.. గన్‌మెన్ హోంమంత్రి దగ్గరగా వచ్చి ఏంటని మరోసారి అడిగే ప్రయత్నం చేశాడు. దాంతో.. ఆగ్రహానికి గురైన హోంమంత్రి మహమూద్‌అలీ గన్‌మెన్‌పై చేయిచేసుకున్నారు. ఒక్కసారిగా చెంపపై ఒక్కటి ఇచ్చారు. అంతలోనే మరొకరు బొకే తెచ్చి ఇవ్వడంతో దాన్ని తీసుకుని మంత్రి తలసానికి అందించారు మహమూద్‌అలీ. అయితే.. గన్‌మెన్‌ను కొట్టగానే పోనీ లెండీ అన్నట్లుగా మంత్రి తలసాని వారించారు. అయితే.. గన్‌మెన్‌పై హోంమంత్రి తలసాని చెంప దెబ్బ కొట్టిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ వీడియోపై రకరకాలుగా స్పందిస్తూ కామెంట్స్ పెడుతున్నారు.