హుజూరాబాద్‌లో దళితబంధు పథకం నిలిపివేతపై దాఖలైన నాలుగు పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఎలక్షన్ కమిషన్(ఈసీ) నిర్ణయం విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. నిష్పక్షపాత ఎన్నికలకు నిర్ణయం తీసుకునే అధికారం ఈసీకి ఉందని తెలిపింది.
హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో అక్కడ దళితబంధును ఆపాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేయగా వీటిని సవాలు చేస్తూ సామాజిక కార్యకర్త మల్లేపల్లి లక్ష్మయ్య, కాంగ్రెస్ నేత జడ్సన్‌లు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేయగా.. ఉప ఎన్నిక పూర్తయ్యే వరకు ప్రజలకు నేరుగా లబ్ధి చేకూర్చే పథకాలను నిలిపివేయాలంటూ వాచ్ వాయిస్ ఆఫ్ పీపుల్స్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్లను పై న్యాయస్థానం విచారణ జరిపింది. పిటిషనర్ల వాదనలను తోసిపుచ్చుతూ నాలుగు పిటిషన్లను కొట్టివేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఈ రోజు తీర్పునిచ్చింది.