వరద ప్రాంతాల్లో సహాయక చర్యలపై నివేదిక ఇవ్వాలి: తెలంగాణ హైకోర్టు

తెలంగాణలో ఎడతెరిపిలేని వర్షాలతో వరదలు సంభవిస్తున్నాయి. దాంతో సహాయక చర్యలపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

By Srikanth Gundamalla  Published on  28 July 2023 12:13 PM GMT
Telangana, High Court, order, relief measures, flood,

వరద ప్రాంతాల్లో సహాయక చర్యలపై నివేదిక ఇవ్వాలి: తెలంగాణ హైకోర్టు

తెలంగాణలో ఎడతెరిపిలేని వర్షాలతో భారీ వరదలు సంభవిస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వరదల వల్ల ప్రజలు పలుచోట్ల ఇబ్బందులు పడుతున్నారు.. అలాంటి చోట్ల ఇప్పటివరకు తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

తెలంగాణను అతలాకుతలం చేసిన ఇటీవలి వరదల సమయంలో రాష్ట్రం తీసుకున్న సహాయక చర్యలపై సమగ్ర నివేదికను సమర్పించాలని ప్రభుత్వాన్ని చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ టి.వినోద్ కుమార్‌లతో కూడిన తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశించింది. వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, వరదల సమయంలో ప్రాణాలు కోల్పోయిన బాధితులపై ఆధారపడిన వారికి నష్టపరిహారం అందించడం, వివిధ జిల్లాల్లో ఇటీవల సంభవించిన వరదల్లో ఇళ్లు కొట్టుకుపోయిన ప్రజలకు నివాసం, ఆహారం, ఇతర సామగ్రిని అందించడంపై నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. నివేదికను జూలై 31వ తేదీలోపు దాఖలు చేయాలని ఆదేశించింది.

తెలంగాణలో గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలు, వరదలపై.. ప్రభుత్వం తీసుకున్న సహాయక చర్యలపై డాక్టర్‌ చెరుకు సుధాకర్‌ వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టుల పరిసర ప్రాంతాల్లో నివాసముంటున్న ప్రజలు భయాందోళనలలో ఉన్నారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 2020 వరదల్లోనూ చాలా నష్టం వాటిల్లిందని చెప్పారు. అప్పుడు చెల్లించాల్సిన పరిహారం, ఎక్స్‌గ్రేషియా ఇప్పటి వరకూ ఇవ్వలేదని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం స్పందిస్తూ సహాయక చర్యలపై నివేదిక సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.


Next Story