రాష్ట్రంలో గణేష్ ఉత్సవాలు, నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం పై ఈ సారి ఆంక్షలు విధించింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్(పీవోసీ) విగ్రహాలను నిమజ్జనం చేయొద్దని స్పష్టం చేసింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కుంటల్లోనే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను నిమజ్జనం చేయాలని సూచించింది. తమ ఆదేశాలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశంచింది. హుస్సేన్‌సాగర్‌లో ట్యాంక్‌బండ్ వైపు నిమజ్జనానికి అనుమతించొద్దని తెలిపింది. హుస్సేన్‌సాగర్‌లో ప్రత్యేకంగా రబ్బరు డ్యాం ఏర్పాటు చేయాలని ఆదేశించింది.
గణేశ్, దుర్గాదేవి విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయకుండా తగిన ఆదేశాలు జారీ చేయాలంటూ గతంలో న్యాయవాది మామిడి వేణుమాధవ్ వేసిన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం ఇటీవల సుదీర్ఘంగా విచారణ జరిపింది. దీనిపై వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వు చేసింది హైకోర్టు. తాజాగా గురువారం తీర్పును వెల్లడించింది.
జీహెచ్ఎంసీ అధికారులు నిమజ్జనం రోజున ఉచితంగా మాస్కులు పంపిణీ చేయాలని, భక్తులు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. రోడ్లపై ఆటంకం కలిగించేలా మండపాలు ఉండరాదని చెప్పింది. రాత్రి 10 తరువాత ఎలాంటి ధ్వని కాలుష్యం రాకుండా చూడాలని చెప్పింది. ప్రసార మాధ్యమాల ద్వారా వీటిని విస్తృతంగా ప్రచారం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.