ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసులు

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు హైకోర్టు షాక్‌ ఇచ్చింది.

By Srikanth Gundamalla  Published on  22 March 2024 2:15 PM IST
telangana, high court, notice,  khairatabad, mla danam nagender,

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసులు

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు హైకోర్టు షాక్‌ ఇచ్చింది. ఎమ్మెల్యేగా దానం నాగేందర్‌ ఎన్నికల చెల్లదు అంటూ ఆయన ప్రత్యర్థి, బీఆర్ఎస్‌ నేత విజయారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్‌ను జస్టిస్‌ విజయసేన్‌ రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. విచారణలో భాగంగా ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు హైకోర్టు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.

తన పిటిషన్‌లో విజయారెడ్డి ఈ విధంగా పేర్కొన్నారు. దానం నాగేందర్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారనీ తెలిపారు. విజయారెడ్డి తరఫున న్యాయవాది సుంకర నరేశ్‌ హైకోర్టులో వాదనలు వినిపించారు. ఓటర్లకు డబ్బులు పంచారనీ.. దీనిపై ఆయా పోలీస్‌ స్టేషన్లలో కేసులు కూడా నమోదు అయ్యాయని కోర్టుకు వివరించారు. ఆయన సతీమణి పేరు మీద ఉన్న ఆస్తుల వివరాలను నామినేషన్‌ పత్రాల్లో పేర్కొనలేదన్నారు. వాదనలు విన్న హైకోర్టు.. ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు నోటీసులు జారీ చేసింది. వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. దాంతో.. ఆయనకు హైకోర్టు షాక్‌ ఇచ్చినట్లు అయ్యింది. ఇక తదుపరి విచారణను హైకోర్టు వచ్చే నెల 18కి వాయిదా వేసింది.

కాగా.. తెలంగాణలో 2023లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇందులో కాంగ్రెస్ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన దానం నాగేందర్‌.. బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డిపై విజయం సాధించారు. 2014 మార్చి 17న దానం నాగేందర్‌ బీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పారు. ఆ తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో దానం నాగేందర్‌ను సికింద్రాబాద్‌ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించింది.

Next Story