తెలంగాణలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి లైన్ క్లియర్
తెలంగాణలో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి లైన్ క్లియర్ అయ్యింది.
By Srikanth Gundamalla Published on 4 Jan 2024 5:23 PM IST
తెలంగాణలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి లైన్ క్లియర్
తెలంగాణలో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి లైన్ క్లియర్ అయ్యింది. కానిస్టేబుల్ నియామక పరీక్షపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టివేసింది. సివిల్ కానిస్టేబుల్ పరీక్షలో నాలుగు ప్రశ్నలకు సంబంధించి మార్కులు కలపాలంటూ గతంలో సింగిల్ బెంచ్ ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై మరోసారి విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం ఆ ఆదేశాలను కొట్టివేసింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం సాయం తీసుకుని నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలనీ.. అభ్యంతరాలు ఉన్న నాలుగు ప్రశ్నలపై నిపుణుల కమిటీ తేల్చాలనీ టీఎస్‌ఎల్‌పీఆర్‌బీని హైకోర్టు ఆదేశించింది.
కాగా.. నాలుగు ప్రశ్నలకు ఆప్షన్లు తెలుగులో ఇవ్వలేదనీ దాంతో తాము నష్టపోయామంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ వేశారు. నాలుగు ప్రశ్నలకు ఆప్షన్లను వాడుకలో ఉన్న పదాలే ఇచ్చామనీ పోలీస్ నియామక మండలి హైకోర్టుకు వివరించింది. నాలుగు ప్రశ్నలపై అభ్యంతరాలను నిపుణుల కమిటీ తేల్చిన తర్వాత నియామక ప్రక్రియ పూర్తి చేయాలని హైకోర్టు తాజాగా ఆదేశించింది. నాలుగు వారాల్లోగా కానిస్టేబుల్ నియామక ప్రక్రియను పూర్తి చేయాలని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డుకు హైకోర్టు సూచించింది. తద్వారా తెలంగాణలో 15,640 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ అయ్యింది.