తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గిరిజా ప్రియదర్శిని కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న జస్టిస్ గిరిజా ప్రియదర్శిని ఆదివారం మధ్యాహ్నం మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖకు చెందిన గిరిజా ప్రియదర్శిని 1995లో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. విశాఖ న్యాయస్థానంలో ఏడు సంవత్సరాల పాటు ప్రాక్టీస్ చేశారు. 2008లో డిస్ట్రిక్ట్ అడిషనల్ జస్టిస్‌గా బాధ్యతలు చేపట్టారు.
ఖమ్మం ఫ్యామిలీ కోర్టులో మూడేండ్లు, విజయనగరం మొదటి అదనపు జిల్లా జడ్జిగా, నంద్యాలలో అదనపు జిల్లా జడ్జిగా పనిచేశారు. 2017లో ఒంగోలు జిల్లా కోర్టు చీఫ్‌గా పదోన్నతి పొందారు. ఆదిలాబాద్ జిల్లా కోర్టు చీఫ్ జడ్జిగా చేశారు. ఆ తర్వాత కరీంనగర్ జిల్లా కోర్టు చీఫ్ జడ్జిగా చేశారు. హైకోర్టు జడ్జిగా బాధ్యతలు స్వీకరించే కంటే ముందు.. గిరిజా ప్రియదర్శిని.. రాష్ట్ర లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీగా పని చేశారు. గిరిజా ప్రియదర్శిని మృతిపట్ల తోటి జడ్జిలు, న్యాయవాదులు, హైకోర్టు సిబ్బంది సంతాపం వ్యక్తం చేశారు.