హైదరాబాద్: రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న లిఫ్ట్ ప్రమాదాలపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భద్రతా నియమాలు లేకుండా సామాన్యుల ప్రాణాలు గాలిలో కలవాల్సిందేనా అని ప్రశ్నిస్తూ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. 'తెలంగాణ లిఫ్ట్‌ల చట్టం-2025'ను వచ్చే నాలుగు వారాల్లోగా సిద్ధం చేసి సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇకపై గడువు పొడిగించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.
చట్టం చేయడానికి ప్రభుత్వం అడిగిన ఆరు నెలల సమయాన్ని చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ధర్మాసనం తిరస్కరించింది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఇంత ఆలస్యం ఎందుకని ప్రశ్నించింది. నివాస, వాణిజ్య భవనాల్లో లిఫ్ట్ భద్రతకు ప్రత్యేక చట్టం లేకపోవడం వల్లే పదే పదే ప్రమాదాలు జరుగుతున్నాయని కోర్టు అభిప్రాయపడింది. పొరుగు రాష్ట్రాల్లో చట్టాలు ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు లేవని నిలదీసింది.
చట్టం వచ్చే వరకు భద్రతా ప్రమాణాలపై తక్షణమే కార్యనిర్వాహక ఉత్తర్వులు (Executive Orders) జారీ చేయాలని సూచించింది. లిఫ్ట్ ప్రమాదాల్లో మరణాలను అరికట్టాలని కోరుతూ న్యాయవాది బర్కత్ అలీ ఖాన్ రాసిన లేఖను హైకోర్టు PIL (ప్రజా ప్రయోజన వ్యాజ్యం) గా స్వీకరించి ఈ విచారణ చేపట్టింది.