సింగరేణి ఎన్నికలకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్
సింగరేణి ఎన్నికల నిర్వహణపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
By Srikanth Gundamalla Published on 21 Dec 2023 10:46 AM GMTసింగరేణి ఎన్నికలకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్
సింగరేణి ఎన్నికల నిర్వహణపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిసెంబర్ 27న ఎన్నికలు నిర్వహించేందుకు వీలు కల్పించింది తెలంగాణ హైకోర్టు. ఈ మేరకు ఎన్నికలు వాయిదా వేయాలన్న మధ్యంతర ఉత్తర్వులను రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. దాంతో.. యథావిధిగా ఎన్నికలు జరగనున్నాయి.
డిసెంబర్ 27న సింగరేని ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా.. వాటిని డిసెంబర్ 27కి బదులు వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించాలని రాష్ట్ర ఇంధన శాఖ పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం కొత్తగా ఏర్పాటైన నేపథ్యంలో ఎన్నిక నిర్వహణకు సమయం కావాలని కోర్టును కోరారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం సింగరేణి ఎన్నికలు నిర్వహించేందుకు మొగ్గు చూపింది. ఎన్నికల విషయంలో నోటిఫికేషన్ ఇచ్చే ముందు ఒక్కసారి గుర్తింపు సంఘం, తర్వాత యాజమాన్యం, మోసారి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరుగా ఎన్నికలను వాయిదా వేయించాయి. చివరకు అసెంబ్లీ ఎన్నికల నోటిఫకేషన్ కూడా సింగరేణి గుర్తింపు ఎన్నికలకు అడ్డుగా మారాయి. ఇంధన శాఖ పిటిషన్ నేపథ్యంలో కోర్టు తీర్పు ఎలా ఉంటుందో అనే విషయంలో సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో కోర్టు తీర్పుతో ఎన్నికల నిర్వహణకు అడ్డంకి తొలగిపోయింది.
సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు 2017లో నిర్వహించారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుబంధ సంఘం టీబీజీకేఎస్ తొమ్మిది డివిజన్లలో విజయం సాధించి గుర్తింపు సంఘంగా ఆవిర్భవించింది. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం గడువు 2019 సెప్టెంబర్‌లో ముగిసింది. రెండేళ్లు, నాలుగేళ్ల వివాదంపై గుర్తింపు కార్మిక సంఘం నాయకులు కోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత పలు కారణాలతో చాలా సార్లు ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి. వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించాలని రాష్ట్ర ఇంధన శాఖ పిటిషన్ దాఖలు చేసింది. తాజాగా.. ఆ మద్యంతర పిటిషన్‌ను కొట్టేసిన రాష్ట్ర హైకోర్టు ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.