హైదరాబాద్: హుక్కా పార్లర్‌ను నడిపేందుకు షరతులతో కూడిన అనుమతిని మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు.. హుక్కా పార్లర్ యజమానులను వేధించవద్దని పోలీసులను ఆదేశించింది. హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక లాంజ్ హుక్కా & కేఫ్ చాంద్రాయణగుట్ట యజమాని హబీబ్ అబూ బకర్ అల్-హమీద్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను విచారిస్తూ హైకోర్టు పై ఆదేశాలు జారీ చేసింది. సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం, 2003 ప్రకారం.. హుక్కా పార్లర్‌ను నిర్వహించడానికి ప్రత్యేక లైసెన్స్ పొందాల్సిన అవసరం లేదు. అయితే అదే చట్టం రెస్టారెంట్లు, కేఫేలలో 30 కంటే ఎక్కువ సీట్ల సామర్థ్యంతో, రెస్టారెంట్ల యజమానులు వినియోగదారులను ప్రత్యేక మూలలో పొగ త్రాగడానికి అనుమతి ఇచ్చిందని హైకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
ధూమపానం మరియు హుక్కా కోసం వేర్వేరు ప్రాంతాలను కలిగి ఉన్న రెస్టారెంట్ యజమానులు స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. తద్వారా వారు కేటాయించిన ప్రాంతంలో నిర్వహించే కార్యకలాపాలపై తనిఖీ చేయవచ్చు చట్టం ప్రకారం ఏదైనా ఉల్లంఘన జరిగితే చర్యలు తీసుకుంటారు. వ్యాపారం.. నియమాలు, విధానాలకు కట్టుబడి నిర్వహించబడుతుందా? అనేది చూస్తారు. అయితే ఇలాంటి పార్లర్ల నిర్వాహకులను పోలీసులు వేధించకూడదు. పోలీసులపై అవకతవకలు జరిగితే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలన్నారు. అయితే హుక్కా పార్లర్‌ను తనిఖీ చేసేందుకు లోపలికి రావద్దని సమర్థ అధికారులను ఆదేశించలేమని కోర్టు పేర్కొంది.