హైదరాబాద్: ఓబుళాపురం మైనింగ్ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టు మంగళవారం క్లీన్ చిట్ ఇచ్చింది. ఓబుళాపురం మైనింగ్ అక్రమాల కేసులో ఆమెపై వచ్చిన అభియోగాలను కొట్టి వేసిన కోర్టు.. ఆమెను నిర్దోషిగా విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ నుంచి లంచం తీసుకున్నారంటూ ఆమెపై సీబీఐ కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను విచారించిన కోర్టు తీర్పును ప్రకటించింది.
ఆమె ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన 2004 - 2009 సమయంలో గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి రూ.80 లక్షలు లంచం తీసుకుని అనుమతి ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి. ఆమె కూడా ఏడాదిపాటు జైలులో ఉండి బెయిల్‌పై విడుదలైంది. అప్పటి నుంచి ఈ కేసు కొట్టేయాలని పోరాడుతున్న శ్రీలక్ష్మికి ఇన్నాళ్లకు ఊరట లభించింది. తాజాగా అవినీతి కేసు నుంచి ఆమెకు విముక్తిని ఇస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
రాష్ట్ర విభజన తర్వాత ఐఏఎస్ శ్రీలక్ష్మి ఏపీకి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఏపీ పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వై.శ్రీలక్ష్మీ పని చేస్తున్నారు. హైకోర్టు క్లీన్‌చిట్ ఇవ్వడంతో శ్రీలక్ష్మి ఏపీ చీఫ్ సెక్రటరీగా నియమితులు అయ్యేందుకు అడ్డంకులు పూర్తిగా తొలగిపోయాయని చెప్పుకోవచ్చు. అయితే తెలంగాణ హైకోర్టు తీర్పుపై సీబీఐ సుప్రీంకోర్టులో అప్పీలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే గాలి జనార్ధన్‌రెడ్డి కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో సీబీఐ పోరాడుతోంది. ఓబుళాపురం మైనింగ్ అక్రమాల కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత కీలక పరిణామాలు జరుగుతున్నాయి.