తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి కట్టడికి ప్రభుత్వం చేపట్టిన చర్యలపై హైకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. రాష్ట్ర సరిహద్దుల్లో అంబులెన్స్‌లు ఆపడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లతో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్ హజరయ్యారు.
ఇతర రాష్టాల నుంచి ఆంబులెన్స్‌లో వస్తున్న వారికి టెస్టులు చేయమని మాత్రమే చెప్పామని.. వారిని ఆపమని మీకు ఎవరు చెప్పారంటూ హైకోర్టు మండిపడింది. హైదరాబాద్, రంగారెడ్డిలలో కేసులు తగ్గాయని ఎలా చెపుతున్నారని ప్రశ్నించింది. టెస్టుల సంఖ్య పెంచమంటే.. తగ్గిస్తారా..? నిబంధనల ఉల్లంఘనపై మీడియా కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. కోర్టు ఆదేశాలు బుట్టదాఖలు చేయడం బాధాకరం. అధికారులు కోర్టు ధిక్కరణ చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొంది.
పాతబస్తి ప్రాంతాల్లో ప్రజలు రోడ్ల మీద గుంపులు గుంపులుగా తిరుగుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం చెప్పే విషయాలకు క్షేత్రస్థాయి పరిస్థితులకు పొంతన లేదని చెప్పింది. రాత్రి కర్ఫ్యూ సరిగా అమలు కావడం లేదని.. రంజాన్ తర్వాతే కరోనా కట్టడిపై తదుపరి చర్యలు చేపట్టాలని భావిస్తున్నారా..? అని ప్రశ్నించింది.
దీనిపై ఏజీ(అడ్వొకేట్ జనరల్) సమాధానం ఇస్తూ.. ఈరోజు మధ్యాహ్నం జరిగే కేబినేట్ సమావేశంలో కరోనా కట్టడిపై నిర్ణయాలు తీసుకుంటామని కోర్టుకు తెలిపారు. కేబినేట్ సమావేశం అయ్యే వరకు విచారణ వాయిదా వేయాలని ఏజీ.. కోర్టును కోరగా.. తదుపరి విచారణను మధ్యాహ్నాం 2.30గంటలకు వాయిదా వేసింది.