కొత్తగూడెం ఎమ్మెల్యేపై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు

కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై అనర్హత వేటు వేస్తున్నట్లు తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. .

By Srikanth Gundamalla  Published on  25 July 2023 7:27 AM GMT
Telangana, High Court, disqualifies, Kothagudem MLA ,

 కొత్తగూడెం ఎమ్మెల్యేపై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు

తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై అనర్హత వేటు వేస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాదు.. సమీప అభ్యర్థి జలగం వెంకట్రావ్‌ను కొత్తగూడెం ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ సంచలన తీర్పు వెల్లడించింది.

కొత్తగూడెం ఎమ్మెల్యేగా వనమా గెలుపుని సవాల్‌ చేస్తూ.. జలగం వెంకట్రావు 2018లో హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల అఫిడవిట్‌లో వనమా తప్పుడు పత్రాలు సమర్పించారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు జలగం వెంకట్రావు. ఈ మేరకు అప్పటి నుంచి హైకోర్టులో విచారణ కొనసాగుతూనే ఉంది. సమగ్ర విచారణ అనంతరం హైకోర్టు వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదని తీర్పునిచ్చింది. ఆ తర్వాత సమీప అభ్యర్థిగా ఉన్న జలగం వెంకట్రావుని విజేతగా ప్రకటించింది. హైకోర్టు తాజా తీర్పు తెలంగాణ రాజకీయాల్లోనే సంచలనంగా మారింది. నాలుగేళ్లకు పైగా ఎమ్మెల్యేగా పనిచేశాక ఎన్నికలకు ఇంకొద్ది నెలలే మిగిలిన ఉన్న సమయంలోనూ హైకోర్టు తీర్పు ఇలా ఉండటం చర్చనీయాంశంగా మారింది. జలగం వెంకట్రావుకి అనుకూలంగా తీర్పురావడంతో ఆయన సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆలస్యమైనా న్యాయం గెలిచిందంటూ వ్యాఖ్యానించారు.

ఇక తప్పుడు అఫిడవిట్‌ సమర్పించినందుకు వనమా వెంకటేశ్వరరావు రూ.5లక్షల జరిమానా కూడా విధించింది తెలంగాణ హైకోర్టు. 2018 నుంచి ఇప్పటివరకు ఎమ్మెల్యేగా వనమా అర్హుడు కాదంటూ తీర్పుని ఇచ్చింది.

వనమా వెంకటేశ్వరరావు కొత్తగూడెం నుంచి 1989లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1999, 2004లోనూ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కేబినెట్‌లో మంత్రిగా కూడా సేవలు అందించారు. ఇక 2018లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసిన వనమా వెంకటేశ్వరరావు.. విజయం తర్వాత బీఆర్ఎస్‌లో చేరారు. కాగా.. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జలగం వెంకట్రావుపై 4,120 ఓట్ల తేడాతో గెలిచారు వనమా.

జలగం వెంకట్రావు 2004లో తొలిసారి ఖమ్మం సత్తుపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి నెగ్గారు. ఆ తర్వాత 2014లో ఇప్పుడు బీఆర్ఎస్‌గా ఉన్న అప్పటి టీఆర్ఎస్‌ పార్టీ నుంచి పోటీ చేసి కొత్తగూడెం ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో ఓడిపోయారు. కానీ.. మరోసారి హైకోర్టు తీర్పు ద్వారా ఎన్నికలకు ఇంకొంత కాలం మిగిలి ఉండగా మరోసారి కొత్తగూడెం ఎమ్మెల్యేగా నియమితులయ్యారు జలగం వెంకట్రావు.

Next Story