తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మునుగోడు ఉప ఎన్నికల గుర్తుల వివాదంలో టీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం హైకోర్టు కొట్టేసింది.
కారును పోలీన గుర్తును కేటాయించవద్దని టీఆర్‌ఎస్ న్యాయస్థానంలో పిటిషన్ వేసింది. అయితే.. ఇప్పటికే మునుగోడు స్వతంత్య్ర అభ్యర్థులకు గుర్తులు కేటాయించామని ఎన్నికల సంఘం(ఈసీ) హైకోర్టుకు నివేదించింది. దీంతో ఈసమయంలో ఈ పిటిషన్‌పై జోక్యం చేసుకోలేమని తెలిపింది.
యుగతులసి పార్టీకి రోడ్ రోలర్
47 మంది అభ్యర్థులు మునుగోడు ఉప ఎన్నిక బరిలో ఉన్నారు. వీరిలో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీలు గుర్తింపు పొందిన పార్టీలు కాగా.. మిగిలిన వారిలో ఇతర పార్టీలకు చెందిన వారితో పాటు స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. సోమవారం రాత్రి స్వతంత్ర అభ్యర్థులకు రిటర్నింగ్ అధికారి జగన్నాథ్ రావు, ఎన్నికల పరిశీలకులు గుర్తు కేటాయియించారు. ట్రక్కు, ట్రాక్టర్ గుర్తులను ఎవ్వరికి కేటాయించలేదు. అయితే.. రోడ్ రోలర్ గుర్తును ముగ్గురు స్వతంత్రులు కోరగా లాటరీ విధానంలో యుగతులసి పార్టీ నుంచి నామినేషన్ వేసిన శివకుమార్ కొలిశెట్టికి కేటాయించినట్లు తెలిపింది. కేఏ పాల్‌కు ఉంగరం గుర్తు లభించింది.