సినీ నటుడు మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. జల్ పల్లిలోని తన నివాసం వద్ద జర్నలిస్ట్ పై మోహన్ బాబు దాడి చేశారు. ఈ దాడి ఘటనలో ఆయనపై పహాడీ షరీఫ్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తదుపరి దర్యాప్తు చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ లో కోరారు. విచారించిన హై కోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తూ మోహన్ బాబు పిటిషన్ ను కొట్టివేసింది.
మీడియా ప్రతినిధిపై దాడి ఘటనలో మోహన్ బాబు లిఖితపూర్వకంగా క్షమాపణలు తెలిపారు. ఈ ఘటన అనంతరం 48 గంటల పాటు ఆసుపత్రిపాలు కావడంతో వెంటనే స్పందించలేకపోయానని తెలిపారు. ఆ క్షణంలో గేటు విరగ్గొట్టి 30 మంది లోపలికి ఉరుక్కుంటూ వస్తుంటే సంఘ వ్యతిరేక శక్తులు వస్తున్నారేమో అని నేను ఆందోళనతో ఆ పని చేశానని అన్నారు. ఆ రోజు ఆవేశంలో జరిగిన ఘటనలో జర్నలిస్టు గాయపడటం చాలా బాధించిందన్నారు. తన వల్ల జరిగిన ఇబ్బందికి క్షమాపణలు చెబుతున్నానని, టీవీ9 టీంకి, జర్నలిస్ట్ మిత్రుడు రంజిత్ కుటుంబానికి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నానని అన్నారు.