హైదరాబాద్: రాష్ట్రంలో సినిమాల బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వొద్దని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సినిమా టిక్కెట్ల ధరల పెంపు, స్పెషల్ షోల అనుమతుల మంజూరుకు సంబంధించిన అంశాలను పరిశీలించిన తర్వాత కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారం.. అర్ధరాత్రి 1.30 గంటల నుంచి ఉదయం 8.40 గంటల మధ్య ఎలాంటి షోలకు అనుమతి ఇవ్వొద్దని తెలిపింది. 'గేమ్ ఛేంజర్' సినిమా టికెట్ల రేట్ల పెంపుపై దాఖలైన పిటిషన్‌పై కోర్టు విచారించింది.
రేట్ల పెంపు అనుమతులను రద్దు చేసినట్టు ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో కోర్టు తదుపరి విచారణను ఫిబ్రవరి 21వ తేదీకి వాయిదా వేసింది. సినిమా నిర్మాతలు, పంపిణీదారులకు బెనిఫిట్ షోలు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్నందున, ఈ తీర్పు రాష్ట్రంలోని చలనచిత్ర ప్రదర్శన పరిశ్రమను గణనీయంగా ప్రభావితం చేస్తుందని భావిస్తున్నారు. న్యాయస్థానం ఆదేశాలను పాటించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలంగాణ ప్రభుత్వం తన న్యాయ ప్రతినిధుల ద్వారా తెలియజేసింది.