తెలంగాణ రాష్ట్రంలో తొలి మహిళా యూనివర్సిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. తెలంగాణ రాష్ట్రంలో తొలి మహిళా యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్లు బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న సందర్భంగా మంత్రి హరీశ్‌రావు చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయించింది. బడ్జెట్‌పై తన రెండు గంటల సుదీర్ఘ ప్రసంగంలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఉన్నత విద్యలోనూ మహిళలు ముందుండాలని ప్రభుత్వం విశ్వసిస్తోందన్నారు.
"మహిళలు ప్రగతిని సాధించడానికి, రాష్ట్రంలో మొదటి మహిళా విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం రూ. 100 కోట్ల వ్యయం ప్రతిపాదించబడింది" అని మంత్రి హరీశ్ రావు తెలిపారు.యూనివర్సిటీ ఏర్పాటుతో పాటు ములుగులోని ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌ను ఫారెస్ట్ యూనివర్సిటీగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది, ఇందుకోసం రూ.100 కోట్లు ప్రతిపాదించారు. మెదక్, మేడ్చల్, రంగారెడ్డి, నారాయణపేట, గద్వాల్, యాదాద్రి జిల్లాల్లో కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రకటించారు.