వచ్చే విద్యా సంవత్సరం (2026-27) నుంచి తెలంగాణలోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో 1 నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థులకు అల్పాహారంతో పాటు పాలు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ పాల సరఫరా బాధ్యతను 'విజయ డెయిరీ'కి అప్పగించారు. ఇందుకోసం విద్యాశాఖ తొలి విడతగా రూ.120 కోట్ల విలువైన ఆర్డర్‌ను డెయిరీకి ఇచ్చింది. జూన్ నెలలో పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి సరఫరాను సిద్ధం చేయాలని స్పష్టం చేసింది.
ప్రస్తుతం అంగన్‌వాడీ కేంద్రాల్లో టెట్రా ప్యాక్‌ల ద్వారా పాలను విజయ డెయిరీ విజయవంతంగా పంపిణీ చేస్తోంది. ఇదే తరహాలో పాఠశాల విద్యార్థులకు కూడా 150 లేదా 200 మిల్లీ లీటర్ల టెట్రా ప్యాక్‌లను పంపిణీ చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. జాతీయ పోషకాహార సంస్థ (NIN) నిబంధనలకు అనుగుణంగా నాణ్యమైన పాలను విద్యార్థులకు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.