ఆ భూములు అమ్మి.. రూ.13 వేల కోట్లు సమీకరించనున్న తెలంగాణ సర్కార్
Telangana govt to raise 13000 crores by selling lands. తెలంగాణ రాష్ట్రంలో వివిధ సంక్షేమ పథకాలు, ప్రాజెక్టులకు నిధుల నిర్వహణ
By అంజి Published on 19 Feb 2023 12:08 PM ISTతెలంగాణ రాష్ట్రంలో వివిధ సంక్షేమ పథకాలు, ప్రాజెక్టులకు నిధుల నిర్వహణ కోసం ప్రభుత్వ భూములను విక్రయించడం, ఆక్రమణలను క్రమబద్ధీకరించడం ద్వారా రూ.13 వేల కోట్లు సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూమిని ప్రభుత్వం వేలం ద్వారా విక్రయించనుంది. పోచారం, బండ్లగూడ ప్రాంతంలో రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల విక్రయానికి ప్రభుత్వం ఇప్పటికే వేలం నిర్వహించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో భూముల విక్రయం లక్ష్యం రూ.10,000 కోట్లకుగానూ రూ.6,900 కోట్లు రాబట్టింది.
భూముల విక్రయం ద్వారా పన్నేతర ఆదాయాన్ని పెంచుకోవడంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంత కుమారి దృష్టి సారించారు. పన్నేతర ఆదాయాన్ని పెంచేందుకు ఇటీవల జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ, ఫైనాన్స్, స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ తదితర శాఖల అధికారులతో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం నిర్వహించింది. జీఎస్టీ వసూళ్లు కాకుండా ఆస్తి రిజిస్ట్రేషన్ తదితర మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవచ్చు. ఈ ఏడాది జనవరి వరకు ప్రభుత్వానికి దాదాపు రూ.92,000 కోట్లు వచ్చాయి.
అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. ఉపయోగించని ప్రభుత్వ భూములను జిల్లా కలెక్టర్లు గుర్తించారు. తద్వారా వాటిని విక్రయించనున్నారు. జీ-59 కింద మార్కెట్ విలువతో ప్రభుత్వ భూమి ఆక్రమణలను నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందుకు సంబంధించి దాదాపు 14 వేల దరఖాస్తులు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. తెలంగాణలో ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి. కాబట్టి రైతుబంధు, రైతుబీమా, ఇతర పథకాలపై ఖర్చు చేయడానికి నిధులు అవసరంకానున్నాయి.