ఈ ఏడాది 60 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం: సీఎం రేవంత్
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి డిసెంబరులో మొదటి వార్షికోత్సవానికి ముందే 60 వేల ఉద్యోగాల భర్తీని పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రకటించారు.
By అంజి Published on 1 Oct 2024 6:29 AM ISTఈ ఏడాది 60 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం: సీఎం రేవంత్
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి డిసెంబరులో మొదటి వార్షికోత్సవానికి ముందే 60 వేల ఉద్యోగాల భర్తీని పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం విద్యను నిర్లక్ష్యం చేసిందని చెప్పారు. పదేళ్ల పాలనలో గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఒక్క డిఎస్‌సి నోటిఫికేషన్ జారీ చేసి కేవలం 7,857 మంది ఉపాధ్యాయులను నియమించిందని అన్నారు. సోమవారం డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ (డీఎస్సీ) ఫలితాలను సీఎం రేవంత్ ప్రకటించారు.
దసర పండుగ శుభ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని ఎంపికైన అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసి అక్టోబర్ 9 వ తేదీన నియామకపు పత్రాలు అందజేస్తామని సీఎం ప్రకటించారు. డా.బీఆర్ అబేంద్కర్ సచివాలయంలో డీఎస్సీ ఫలితాల విడుదల అనంతరం ముఖ్యమంత్రిగారు విద్యా రంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2012 లో ఒకసారి, తెలంగాణ ఏర్పడిన తర్వాత గడిచిన పదేళ్లలో 2017 లో ఒకే ఒక్కసారి అదికూడా కేవలం 7,857 పోస్టులకు మాత్రమే డీఎస్సీ నిర్వహించారని అన్నారు.
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లో 30 వేల పోస్టులను భర్తీ చేశామన్న సీఎం రేవంత్.. వ్యవస్థలను నిర్వీర్యం చేసి అంగడిగా మార్చిన టీజీపీఎస్సీని ప్రక్షాళన చేశామన్నారు. ప్రస్తుత టీచర్ల నియామకాలు పూర్తయిన తర్వాత ఖాళీల ఆధారంగా కొత్త నియామక ప్రక్రియ చేపడుతామని తెలిపారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం నియామకాలు నిరంతర ప్రక్రియగా సాగుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందన్న కారణంగా పాఠశాలలు మూసివేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని, విద్యపై ఖర్చును భవిష్యత్తుకు పెట్టుబడిగా భావిస్తామన్నారు.