తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అనేక కార్యక్రమాల వల్ల కుల వృత్తులకు పునరుజ్జీవం లభిస్తోందన్నారు. వనపర్తి నియోజకవర్గం శ్రీరంగాపురం మండల కేంద్రంలోని రంగసముద్రంలో ప్రభుత్వం అందిస్తున్న ఉచిత చేపపిల్లల పంపిణీలో భాగంగా చెరువులో రొయ్యలను ఆయన వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్ర పాలనలో చెరువులు ఎండిపోయి మత్స్యకారులు వలసలు వెళ్లే పరిస్థితి ఏర్పడిందన్నారు.
పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి మిషన్ కాకతీయ పథకం కింద చెరువులు నింపి చెరువుల్లో ఉచితంగా చేపపిల్లలను విడుదల చేసి మత్స్యకారులకు ఉపాధి కల్పించారని గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు పౌష్టికాహారం చేపలు, సబ్సిడీ గొర్రెల రూపంలో లభించి గొల్ల కురుమలకు ఆర్థిక స్థిరత్వం వస్తోందన్నారు. రైతుబంధు, రైతుబీమా, ఉచిత 24 గంటల కరెంటు, సాగునీటి సౌకర్యంతో రైతుల బతుకులు మారాయని మంత్రి అన్నారు. ఏ కారణం చేతనైనా రైతు చనిపోతే 10 రోజుల్లో రూ.5 లక్షల పరిహారం అందించే రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని వివరించారు. తెలంగాణ అమలు చేస్తున్న పథకాల పేర్లను మార్చి కేంద్ర, ఇతర రాష్ట్రాలు పథకాలను అమలు చేస్తున్నాయని ఆరోపించారు.