తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ 2024-25 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌లో భాగంగా ఆగస్టు 21 బుధవారం రెండు ముఖ్యమైన బడ్జెట్ విడుదల ఉత్తర్వులు (BROs) జారీ చేసింది. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కల్యాణలక్ష్మి పథకానికి రూ.1,450 కోట్లతో బడ్జెట్ రిలీజ్ ఆర్డర్‌ను విడుదల చేసింది. ఈ పథకం ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన వధువులకు వారి వివాహ సమయంలో ఆర్థిక సహాయం అందిస్తుంది. జీఓ నంబర్ 120 ప్రకారం.. కళ్యాణలక్ష్మి పథకానికి సంబంధించిన ఖర్చులపై నెలవారీ నిబంధనలు పాటించాలని బీసీ సంక్షేమ శాఖను ప్రభుత్వం ఆదేశించింది.
ఈ ఆదేశం 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ కేటాయింపులకు సంబంధించింది. దీంతో కొన్ని నెలలుగా పెండింగ్‌లో ఉన్న కల్యాణలక్ష్మి లబ్దిదారుల దరఖాస్తులకు మోక్షం లభించే అవకాశం ఉంది. కల్యాణ లక్ష్మీ పథకానికి దరఖాస్తు చేసుకునేవారు శాశ్వతంగా తెలంగాణ వాసులై ఉండాలి. వధువుకు కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. వరుడి వయస్సు కనీసం 21 ఏళ్లపైన ఉండాలి. కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.2 లక్షల లోపు ఉండాలి. దరఖాస్తుదారులు ఆన్లైన్లో స్వయంగా అప్లై చేసుకోవచ్చు. లేదంటే మీ సేవా కేంద్రాన్ని సందర్శించినా సరిపోతుంది.