హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోంది. ఇప్పటికే మొదటి విడత లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఈ క్రమంలోనే ఇల్లు కట్టుకుంటున్న లబ్ధిదారులకు ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ చెప్పేందుకు సిద్ధమైంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కావాల్సిన సిమెంట్, స్టీల్‌ను తక్కవ ధరకే సరఫరా చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. మార్కెట్ రేటు కంటే ఎంత తక్కువకు సరఫరా చేస్తారో చెప్పాలని పలు కంపెనీలతో ప్రభుత్వ అధికారులు భేటీ అయ్యారు. రూ.320 ఉన్న సిమెంట్ బస్తా రూ.620కు, రూ.55 వేలు ఉన్న టన్ను స్టీలు రూ.47 వేలకు సరఫరా చేయాలని కోరినట్టు సమాచారం.
ఒక్కో ఇంటికి 180 బస్తాలు, 1500 కిలోల చొప్పున స్టీలు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేశారు. కాగా మొదటి ఫేజ్‌లో రాష్ట్ర వ్యాప్తంగా మండలానికి ఒక్కో గ్రామం చొప్పున 562 గ్రామాల్లో 70,122 ఇళ్లను మంజూరు చేశారు. వీరిలో 47 వేల మందికిపైగా లబ్ధిదారులు అనుమతులకు సంబంధించిన ప్రోసీడింగ్స్ అందుకన్నారు. పనుల పురోగతి ఆధారంగా ప్రతి సోమవారం నాడు లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులు జమ చేస్తోంది. ఈ పథకం ద్వారా లబ్ధిదారుడికి మొత్తం రూ.5 లక్షలు అందుతాయి. అటు 400 నుంచి 600 చదరపు అడుగుల మధ్యలోనే ఇళ్లను నిర్మించుకోవాలని ప్రభుత్వం సూచించింది.