హైదరాబాద్: మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వైద్య ఆరోగ్య శాఖలో 1,623 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. నిన్న మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. రాష్ట్ర చరిత్రలో వైద్యుల భర్తీ ప్రక్రియలో ఇదే అతిపెద్ద నోటిఫికేషన్‌గా మారనుంది. ఇటీవల వైద్య ఆరోగ్య శాఖలో 8 వేల ఉద్యోగాలు భర్తీ చేసిన విషయం తెలిసిందే.
కాగా తాజా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గురువారం వైద్య ఆరోగ్య సేవల రిక్రూట్‌మెంట్ బోర్డును ఆదేశించారు. ఈ రిక్రూట్‌మెంట్ పూర్తి అయితే జిల్లా, ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో పల్లెలకు ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం 7 వేల పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది.
ఇదిలా ఉంటే.. మెడిసిన్ విషయంలో తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇచ్చే సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని డ్రగ్ కంట్రోల్ అథారిటీ అధికారులను మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. ఈ మేరకు డ్రగ్ కంట్రోల్ అథారిటీ పనితీరుపై మంగళవారం, వెంగళరావు నగర్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్‌లో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.