హైదరాబాద్: సంక్రాంతి నాటికి అన్నదాతలకు రైతు భరోసా డబ్బులు అందించనున్నట్టు ప్రభుత్వానికి చెందిన 'తెలంగాణ ఫ్యాక్ట్ చెక్' తెలిపింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని పేర్కొంటి. శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా వ్యవసాయేతర భూములను ఏరివేసే పనిలో ప్రభుత్వం ఉందని, అర్హులైన రైతులకు ఎకరానికి రూ.6000 చొప్పున పండగ నాటికి జమ చేయనుందని చెప్పింది. 4 లక్షల ఎకరాలు కమర్షియల్ ల్యాండ్‌గా గుర్తించినట్టు వెల్లడించింది.
అసలైన అన్నదాతలకే రైతు భరోసా దక్కాలని ప్రభుత్వం నిర్ణయించింది. బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాం నుంచి కొండలు, కమర్షియల్ ప్లాట్లు ఉన్న వారికీ సాయం అందుతోందని తేల్చింది. వారికి చెక్ పెట్టేలా శాటిలైట్ మ్యాపింగ్ చేపట్టినట్టు వివరించింది. సింథటిక్ ఎపర్చర్ రాడార్ ఏజెన్సీ సాయంతో అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే చేసి అనర్హులను గుర్తిస్తున్నారని తెలిపింది. కాగా సంక్రాంతికి రైతు భరోసా డబ్బులు రిలీజ్ చేయనుండగా 65 లక్షల మంది రైతులు అర్హులుగా ఉన్నారని తెలిపింది.