డ్వాక్రా మహిళలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. త్వరలోనే అభయ హస్తం నిధులు డ్వాక్రా మహిళలకు రిటర్న్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. మరి కొద్ది రోజుల్లో మహిళ బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇవాళ అసెంబ్లీలో మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, మల్లారెడ్డి సమావేశం అయ్యారు. అభయ హస్తం నిధులు వాపస్‌పై నిర్ణయం తీసుకున్నారు. డ్వాక్రా మహిళలు పొదుపు చేసుకున్న అభయ హస్తం నిధులను తిరిగి మహిళలకు ఇవ్వాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ వ్యాప్తంగా 21 లక్షల డ్వాక్రా మహిళలకు రూ.545 కోట్ల రూపాయలను పొదు చేసుకున్నారు. ఇది వరకు అభయ హస్తం కింద కంట్రిబ్యూటరీ పెన్షన్ కోసం పొదుపు జరిగింది. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆసరా పథకం అమలు చేసింది. ఈ పథకం కింద మొదట్లో రూ.1000, ఇప్పుడు రూ.2,016ల మొత్తాన్ని పెన్షన్‌గా ఇస్తోంది. ఇదివరకంటే.. ఇప్పుడు ఎక్కువ మొత్తంలో పెన్షన్ వస్తోంది. ఈ నేపథ్యంలోనే చాలా మంది మహిళలు అభయ హస్తం డబ్బులు తమవి తమకు ఇవ్వాలని అడుగుతున్నారు. దీంతో పొదుపు మహిళల కోరిక మేరకు నిధులు తిరిగి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే డ్వాక్రా మహిళల ఖాతాల్లో డబ్బులు జమకానున్నాయి.