హైదరాబాద్: ప్రభుత్వ స్కూళ్లలో చదివే టెన్త్ విద్యార్థులకు ఈసారి అన్ని సబ్జెక్టుల స్టడీ మెటీరియల్ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కోవిడ్ టైమ్‌లో స్కూళ్లు మూతపడి.. ప్రత్యక్ష తరగతులు నడవకపోవడంతో విద్యార్థులను పాఠాలను సులభంగా అర్థం చేసుకుని ఉత్తీర్ణత సాధించేందుకు ప్రభుత్వం 2021 నుండి స్టడీ మెటీరియల్ అందజేస్తోంది. ఇప్పటి వరకు జీవ, భౌతిక, సాంఘిక శాస్త్రం, గణితం సబ్జెక్టు మెటీరియల్సే అందజేసేది. ఈసారి వాటితో పాటు తెలుగు, ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ సబ్జెక్టులకూ ఇవ్వాలని డిసైడ్ అయ్యింది.
ఈ నెలలోనే పంపిణీ చేసేందుకు 2 లక్షల మంది విద్యార్థుల కోసం 7.52 లక్షల స్టడీ మెటీరియల్స్ సిద్ధం చేయిస్తోంది. ఈ మెటీరియల్స్‌ని రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి నిపుణులు రూపొందించారు. కాగా ప్రభుత్వం ఇప్పటికే పాఠ్యపుస్తకాల విభాగానికి స్టడీ మెటీరియల్ ముద్రణకు సంబంధించిన ఆదేశాలు ఇచ్చింది. స్కూల్ డిపార్ట్‌మెంట్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ స్కూళ్లు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, జనరల్ రెసిడెన్షియల్ స్కూళ్లలోని విద్యార్థులకు ఈ మెటీరియల్స్‌ను అందిస్తారు. భాషేతర మెటీరియల్స్‌ను రెండు నెలల కిందటే విద్యార్థులకు అందించారు.