Telangana: ప్రభుత్వ స్కూళ్లలో ఇక నుంచి బ్రేక్‌ఫాస్ట్‌ కూడా..

ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్‌ పథకం ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.

By Srikanth Gundamalla  Published on  16 Sept 2023 6:38 AM IST
Telangana Govt, Breakfast,  Schools, CM KCR, Dussehra,

Telangana: ప్రభుత్వ స్కూళ్లలో ఇక నుంచి బ్రేక్‌ఫాస్ట్‌ కూడా..

తెలంగాణలో విద్యావ్యవస్థను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోంది. ఈ క్రమంలో మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో (ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు) చదువుకునే విద్యార్థానీవిద్యార్థులకు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ పథకం ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దసరా కానుకగా ఈ పథకాన్ని అక్టోబర్‌ 24 నుంచి ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులను కూడా జారీ చేసింది.

విద్యార్థులకు మంచి విద్యతో పాటు నాణ్యమైన భోజనం అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయనుంది. కడుపునిండా భోజనం చేస్తే విద్యార్థులు యాక్టివ్‌గా ఉండి బాగా చదువుకుంటారు. పేద విద్యార్థులకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని చెబుతున్నారు అధికారులు. విద్యార్థులకు పౌష్టికాహారం అందుతుందని చెబుతున్నారు. ఉదయాన్నే వ్యవసాయ, కూలీ పనులకు వెళ్లే విద్యార్థుల తల్లిదండ్రులు పడే ఇబ్బందులను అర్థం చేసుకునే సీఎం కేసీఆర్ మానవీయ కోణంలో ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. అయితే.. దసరా నుంచి ఈ పథకం ప్రారంభంకానుంది.

కాగా.. తమిళనాడులో ఇప్పటికే ఈ తరహా పతకం అమలవుతోంది. 'విద్యార్థులకు అల్పాహారం' పథకం తమిళనాడులో అమలవుతున్న విధానాన్ని పరిశీలించి రావాలని ఐఏఎస్‌ అధికారుల బృందాన్ని సీఎం కేసీఆర్ ఇటీవలే అక్కడికి పంపించారు. తమిళనాడుకు వెళ్లిన అధికారుల బృందం.. అక్కడ అన్నింటినీ పరిశీలించారు. ఆ తర్వాత నివేదికను ప్రభుత్వానికి అందించారు. అలాగే తమిళనాడులో కేవలం ప్రాథమిక పాఠశాలల వరకే విద్యార్థులకు అల్పాహారం పథకం అమల చేస్తున్నారనే విషయాన్ని కూడా కేసీఆర్‌కు తెలిపారు అధికారులు. అయితే.. విద్యార్థుల విషయంలో మానవీయ కోణంలో ఆలోచించిన సీఎం కేసీఆర్.. తెలంగాణలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకూ చదివే అందరు విద్యార్థులకు అల్పాహారం అందించాలని సూచించారు. తాజాగా ఈ పథకం అమలు చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై ప్రతి ఏటా ర.400 కోట్ల అదనపు భారం పడనుంది.

Next Story