సీఎం కేసీఆర్‌ గవర్నర్‌ను అవమానించారు: తమిళిసై

Telangana Governor Tamilsai responds on KCR Comments. గత కొన్ని నెలలుగా తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు, కేసీఆర్‌ ప్రభుత్వానికి పొసగడం

By అంజి  Published on  19 Jan 2023 2:45 PM GMT
సీఎం కేసీఆర్‌ గవర్నర్‌ను అవమానించారు: తమిళిసై

గత కొన్ని నెలలుగా తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు, కేసీఆర్‌ ప్రభుత్వానికి పొసగడం లేదన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నిన్న ఖమ్మం బీఆర్‌ఎస్‌ సభలో సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై గవర్నర్‌ తమిళిసై అభ్యంతరం వ్యక్తం చేశారు. విద్యార్థులు పరీక్ష భయాన్ని జయించేందుకు గాను ప్రధాని మోదీ రాసిన 'ఎగ్జామ్‌ వారియర్స్‌' పుస్తకాన్ని గవర్నర్‌ రాజ్‌భవన్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తమిళిసై మాట్లాడారు. సీఎం కేసీఆర్‌.. గవర్నర్‌ పదవిని అవమానించారని తమిళిసై ఆరోపించారు.

రాజ్యాంగబద్ధమైన గవర్నర్‌ వ్యవస్థను ఎలా అవహేళన చేస్తారని ప్రశ్నించారు. తాను 25 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానన్న తమిళిసై.. ప్రొటోకాల్‌ విషయం తనకూ తెలుసునన్నారు. తాను ఎక్కడా లిమిట్స్‌ క్రాస్‌ చేయలేదని తెలిపారు. తెలంగాణలో ఏడాది నుంచి ప్రోటోకాల్‌ పాటించడం లేదన్నారు. ప్రోటోకాల్‌ ఎందుకు పాటించడం లేదని ప్రశ్నించారు. ప్రోటోకాల్ పై కేసీఆర్ స్పందించాకే రాష్ట్ర ప్రభుత్వ ప్రశ్నలకు సమాధానం చెబుతానని స్పష్టం చేశారు. తన కార్యాలయంలో బిల్లులు పెండింగ్‌లో ఉన్న మాట వాస్తవమన్నారు.

దానికంటే ముందు ప్రొటోకాల్‌ అంశం ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉందని తమిళిసై అన్నారు. రిపబ్లిక్ డే అంశంపై తనకు సమాచారం లేదని ఆమె తెలిపారు. దీనిపై ప్రభుత్వం తీరు ఎలా ఉంటుందో చూడాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ పలు రాష్ట్రాల్లో.. గవర్నర్లతో విపక్ష ముఖ్యమంత్రులను ఇబ్బందులకు గురి చేయిస్తున్నారని ఖమ్మం సభలో సీఎం కేసీఆర్ సహా కేరళ సీఎం పినరయి విజయన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించిన విషయం తెలిసిందే.

Next Story