Warangal: ప్రీతి ఆత్మహత్య వ్యవహారం.. యూనివర్సీటీ అధికారులపై గవర్నర్ సీరియస్
వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని కాళోజీ యూనివర్సిటీ వీసీని గవర్నర్ తమిళిసై కోరారు.
By అంజి Published on 28 Feb 2023 4:15 PM ISTతెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
హైదరాబాద్: సీనియర్ వేధింపుల కారణంగా వైద్య విద్యార్థిని ధరవతి ప్రీతి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (కెఎన్‌ఆర్‌యుహెచ్‌ఎస్) వైస్ ఛాన్సలర్‌ను తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కోరారు. నిజానిజాలను వెలికితీసేందుకు సాధ్యమైన అన్ని కోణాల్లో సమగ్ర విచారణ జరిపించాలని రాజ్ భవన్ వైస్ ఛాన్సలర్‌కు లేఖ పంపింది. సవివరమైన నివేదికను సమర్పించాలని కోరారు.
యూనివర్సిటీలో వేధింపులు, ర్యాగింగ్ వంటి సంఘటనలను ఎదుర్కోవటానికి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP)పై నివేదికను కూడా రాజ్ భవన్ కోరింది. వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, పనితీరు గురించి కూడా లేఖలో ప్రస్తావించారు. మహిళా మెడికోలకు ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని గవర్నర్ కోరారు. ఇలాంటి సంఘటనలలో ఎలాంటి ఉదాసీనత లేకుండా, తక్షణం స్పందించి కాలేజీలలో కఠిన చర్యలు తీసుకోవాలని గవర్నర్ సూచించారు. పీజీ మెడికోల డ్యూటీ సమయాలు, వారికి సంబందించి సరైన విశ్రాంతి లాంటి అంశాలపై సరైన శ్రద్ధ పెట్టాలన్నారు.
వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ) ఎండీ విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై గవర్నర్ సీరియస్ అయ్యారు. డాక్టర్ ప్రీతి ఆరోగ్యం సరిగా లేదని మొదట తప్పుడు సమాచారం ఇచ్చి నిందితుడిని కాపాడటానికి ప్రయత్నించిన కాళోజీ హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ అధికారులపై గవర్నర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వరంగల్‌లోని అనస్థీషియా విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ (ఎండీ) మొదటి సంవత్సరం చదువుతున్న ప్రీతి ఫిబ్రవరి 22న ఎంజీఎం ఆస్పత్రిలో డ్యూటీలో ఉండగా ప్రాణాంతక ఇంజక్షన్ తీసుకుంది. అదే రోజు ఆమెను హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)కి తరలించగా, ఫిబ్రవరి 26న ఆమె మరణించింది. విద్యార్థిని నిమ్స్‌కు తరలించడంలో విలువైన సమయం పోయిందని లేఖలో పేర్కొన్నారు. ఆమెను ఎంజీఎంలో ఉంచి చికిత్స అందించి ఉండవచ్చని గవర్నర్ భావించారు.
సోమవారం మధ్యాహ్నం జనగాం జిల్లాలోని గిర్ని తండాలో 26 ఏళ్ల గిరిజన విద్యార్థిని అంత్యక్రియలు జరిగాయి. అంతకుముందు నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితిని అడిగి తెలుసుకునేందుకు, కుటుంబ సభ్యులను ఓదార్చేందుకు గవర్నర్ ఆసుపత్రికి వచ్చారు. అనస్థీషియా విభాగంలో రెండో సంవత్సరం చదువుతున్న ప్రీతి సీనియర్ ఎంఏ సైఫ్‌ను వరంగల్ పోలీసులు ఫిబ్రవరి 24న అరెస్టు చేశారు. ప్రీతిని తన సీనియర్ వేధింపులకు గురిచేయడమే ఆమెను తీవ్ర చర్య తీసుకునేలా చేసి ఉంటుందని పోలీసులు తెలిపారు.
సైఫ్ వేధింపుల కారణంగానే ప్రీతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. అతనిపై షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నిరోధక) చట్టం, యాంటీ ర్యాగింగ్ చట్టం కింద కూడా కేసు నమోదు చేయబడింది.