ఎమ్మెల్సీలుగా కోదండరామ్, అమీర్ అలీఖాన్.. గవర్నర్ ఆమోదం
తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీలను ఎంపిక చేశారు.
By Srikanth Gundamalla Published on 25 Jan 2024 11:23 AM GMTఎమ్మెల్సీలుగా కోదండరామ్, అమీర్ అలీఖాన్.. గవర్నర్ ఆమోదం
తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీలను ఎంపిక చేశారు. ఇద్దరు ఎమ్మెల్సీలను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఎంపిక చేశారు. ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరామ్, మీర్ అమీర్ అలీఖాన్‌ను గవర్నర్ ఎంపి చేశారు. ఈ మేరకు ఆమోదం తెలిపారు.
కాగా.. వారం రోజుల క్రితం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల లిస్ట్‌ను తమిళిసైకి పంపింది రాష్ట్ర ప్రభుత్వం. అందులో ప్రొఫెసర్ కోదండరాంతో పాటు అమీర్ అలీఖాన్ పేర్లను చేర్చింది. సీఎం రేవంత్‌రెడ్డి దావోస్ పర్యటనకు ముందే పేర్లను పంపగా.. బుధవారం గవర్నర్‌తో భేటీ సందర్భంగా ఎమ్మెల్సీల అంశం చర్చకు వచ్చింది. ఇక త్వరలోనే గవర్నర్ అధికారిక ప్రకటన కూడా చేయనున్నారు.
2023 జూలై 31న దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణల పేర్లను గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా సిఫారసు చేస్తూ అప్పటి బీఆర్ఎస్ నేతృత్వంలోని కేసీఆర్ సర్కార్ గవర్నర్ కు సిఫారసు చేసింది. అయితే 2023 సెప్టెంబర్ 25న ఈ ఇద్దరి పేర్లను గవర్నర్ తమిళిసై తిరస్కరించారు. నిబంధనల మేరకు వీరిద్దరి పేర్లను ఆమోదించలేమని గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ గెలిచి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత గవర్నర్ కోటా ఎమ్మెల్సీల కోసం పలువురి పేర్లను పరిశీలించింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ మద్దతు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయనకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ పదవిని ఇస్తుందనే టాక్ వినిపించింది. మరోవైపు అలీ మస్కతి, జాఫర్ జావీద్, షబ్బీర్ అలీ పేర్లు కూడా వినిపించాయి. అయితే.. షబ్బీర్ అలీకి ప్రభుత్వ సలహాదారు పదవిని ఇచ్చారు. మరోవైపు పార్లమెంట్ ఎన్నికలకు కూడా తెలంగాణ కాంగ్రెస్ సిద్ధం అవుతోంది.