తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తన మంచి మనసును చాటుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆన్‌లైన్ క్లాసులు వినడం లేదని ఓ యువకుడు చేసిన ట్వీట్‌కు స్పందించిన గవర్నర్ అతడికి సాయం చేశారు. రంగారెడ్డి జిల్లా చేతూరు గ్రామానికి చెందిన ప్రమోద్ డిఫార్మా మూడో సంవత్సరం చదువుతున్నాడు. సామాన్య కుటుంబానికి చెందిన అతడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే 'మై గవర్నమెంట్ యాప్' లో క్విజ్ పోటీల్లో పాల్గొనేవాడు. ఇటీవల అతను తనకు ల్యాప్‌టాప్ లేకపోవడంతో ఆన్‌లైన్ తరగతులకు దూరమవుతున్నానని చెబుతూ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ కు ట్వీట్ చేశాడు.
ఆ యువకుడి ట్వీట్‌కు చలించిన గవర్నర్.. అతడిని రాజ్‌భవన్‌కు ఆహ్వానించారు. ఊహించని విధంగా గవర్నర్ నుంచి పిలుపు రావటంతోరాజ్ భవన్ కు వెళ్లారు. అక్కడ అతడికి అవసరమైన ల్యాప్ టాప్ ను అందజేయటం ద్వారా గవర్నర్ తన పెద్ద మనసును చాటుకున్నారు. తన సమస్యకు రాజ్ భవన్ స్పందించిన తీరు ఆ యువకుడిలో కొత్త స్ఫూర్తిని నింపటమే కాదు.. మరింత కష్టపడటానికి ఊతమిచ్చినట్లుగా చెబుతున్నారు.