విమానంలో గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై వైద్యం

Telangana Governor DR Tamilisai Soundararajan treated patient in flight.తెలంగాణ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ తమిళిసై సౌందరరాజన్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 July 2022 4:19 AM GMT
విమానంలో గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై వైద్యం

తెలంగాణ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ తమిళిసై సౌందరరాజన్ మ‌రోసారి త‌న మంచి మ‌న‌సును చాటుకున్నారు. విమానంలో అస్వ‌స్థ‌త‌కు గురైన ఓ ప్ర‌యాణీకుడికి స్వ‌యంగా చికిత్స అందించి అంద‌రి మ‌న్న‌ల‌ను పొందారు.

ఏం జ‌రిగిందంటే.. ఢిల్లీ నుంచి హైద‌రాబాద్ వ‌స్తున్న ఇండిగో విమానంలో ఓ ప్ర‌యాణీకుడు అనారోగ్యానికి గురైయ్యాడు. విమానంలో గాల్లో ఉండ‌డంతో అత్య‌వ‌స‌రంగా దించేందుకు వీలులేదు. దీంతో ఫ్లైట్ అటెండెంట్ ఈ విమానంలో ఎవ‌రైనా డాక్ట‌ర్ ఉన్నారా..? అని ప్ర‌యాణీకుల‌ను అడిగారు. అదే విమానంలో గ‌వ‌ర్న‌ర్ తమిళిసై సౌందరరాజన్ కూడా ఉన్నారు.

తాను వైద్యురాలు కూడా కావ‌డంతో వెంట‌నే గ‌వ‌ర్న‌ర్ అనారోగ్యానికి గురైన ప్ర‌యాణీకుడి వ‌ద్ద‌కు వెళ్లి చికిత్స అందించారు. దీంతో అత‌డు కోలుకున్నాడు. విమానం హైద‌రాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయిన అనంత‌రం ఆ ప్ర‌యాణీకుడిని ఎయిర్ పోర్ట్ మెడిక‌ల్ వార్డుకు త‌ర‌లించారు. అజీర్తి కార‌ణంగా ఆ ప్ర‌యాణీకుడికి బాగా చెమ‌ట‌లు ప‌ట్టిన‌ట్లు తెలుస్తోంది.

కాగా.. అంత గొప్ప స్థానంలో ఉన్న‌ప్ప‌టికీ సాటి మ‌నిషికి వైద్య సహాయం అందించినందుకు గ‌వ‌ర్న‌ర్‌ తమిళిసై సౌందరరాజన్ పై స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది.

Next Story