తెలంగాణ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ నియామకం

తెలంగాణ గవర్నర్ గా సీపీ రాధాకృష్ణన్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు.

By Srikanth Gundamalla
Published on : 19 March 2024 11:33 AM IST

telangana, governor, cp radha krishnan,

తెలంగాణ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ నియామకం

తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై సౌందరరాజన్‌ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆమె రాజీనామాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. తాజాగా తెలంగాణ గవర్నర్ గా సీపీ రాధాకృష్ణన్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. మార్చి 18న తెలంగాణ గవర్నర్‌ పదవికి తమిళిసై సౌందర రాజన్‌ రాజీనామా చేశారు. ఇక రాష్ట్ర గవర్నర్‌ పదవితో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ పదవికి కూడా తమిళిసై రాజీనామా చేశారు. తెలంగాణ గవర్నర్ బాధ్యతలతో పాటు.. పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ బాధ్యతలను సైతం అదనంగా సీపీ రాధాకృష్ణన్‌కు అందజేశారు.

పూర్తిస్థాయి గవర్నర్‌ నియామకం అయ్యే వరకు సీపీ రాధాకృష్ణన్‌ తెలంగాణ, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌లుగా కొనసాగుతారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. తమిళనాడులో బీజేపీలో సీనియర్‌ పొలిటీషియన్‌గా కొనసాగుతున్న రాధాకృష్ణన్‌ను గత ఏడాది ఫిబ్రవరిలో జార్ఖండ్‌ గవర్నర్‌గా రాష్ట్రపతి నియమించారు. కోయంబత్తూరు నుంచి రెండుసార్లు ఎంపీగా సీపీ రాధాకృష్ణన్‌ ఎన్నిక అయ్యారు. 1957లో తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా తిరుపూర్‌లో రాధాకృష్ణన్‌ జన్మించారు. టుటికోరియన్‌లోని వీఓసీ కాలేజ్‌ నుంచి వ్యాపార పరిపాలనలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. జనసంఘ్‌, రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌లో కూడా పనిచేశారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు సీపీ రాధాకృష్ణన్. 1998, 199లో కోయంబత్తూరు లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించారు.

మరోవైపు లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచేందుకే తమిళిసై సౌందరరాజన్ తెలంగాణ గవర్నర్‌ పదవి రాజీనామా చేశారు. ప్రజలకు సేవ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కన్యాకుమారి, చెన్నై సౌత్, తిరునల్వేలి లోక్‌సభ నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Next Story