రైతు భరోసా (రైతుబంధు) పెట్టుబడి సాయం విడుదలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణం తీసుకుంది. ఈ క్రమంలోనే ఈ పథకాన్ని పక్కాగా అమలు చేసేందుకు వ్యవసాయ శాఖ అధికారులు కసరత్తులు చేస్తున్నారు. రిమోట్ సెన్సింగ్ సర్వే ద్వారా భూముల వివరాలు సేకరించనుంది. శాటిలైట్ ఫొటోల ఆధారంగా సాగు, బీడు భూముల వివరాలను నిర్ధారించనుంది. కొండలు, గుట్టలు, శ్మశానాలు, రియల్ ఎస్టేట్ భూములు, రోడ్లు, చెరువులను గుర్తించి.. అనర్హులను తేల్చనుంది. సాగయ్యే భూములకు మాత్రమే రైతు భరోసా ఇవ్వనుంది. ఈ పథకం కింద ఎకరానికి రూ.15 వేలు సాయం చేయనుంది. వచ్చే సీజన్‌లో సాగు భూములకు మాత్రమే పెట్టుబడి సాయం అందిస్తామని ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే సాగు లెక్కలు తేల్చేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. జిల్లాలు, మండలాలు, గ్రామాలవారిగా ఉన్న సాగు భూమి ఎంత? బీడు పడ్డ భూమి ఎంత? రాళ్లు, గుట్టలతో సేద్యానికి పనికిరాకుండా ఉన్న భూమి ఎంత? గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సాగు చేయని భూములలో ఎన్ని ఎకరాలకు రైతుబంధు ఇచ్చారు? అందులో కొండలు, గుట్టలు ఎన్ని ఉన్నాయనే అంశాలతో సమగ్ర వివరాలు సేకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. క్షేత్రస్థాయి అధికారులకు ప్రతి వెయ్యి ఎకరాలకు ఒక సహాయకున్ని నియమిస్తే సాగు లెక్కలను పక్కాగా తేల్చే అవకాశం ఉందని ఏఈవోలు అంటున్నారు. రైతు బంధు లెక్కల ప్రకారం రాష్ట్రంలో 1.52 కోట్ల ఎకరాల పట్టా భూములు ఉన్నాయి.